Asianet News TeluguAsianet News Telugu

తప్పు జరిగిందని అన్నప్పుడు.. సీమెన్స్ సంస్థను ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదు?: పయ్యావుల

వైసీపీ ప్రభుత్వం వాళ్లు  అనుకున్నది చేసుకుంటూ పోతున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆలోచనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

Payyavula Keshav Slams YSRCP Over Chandrababu Arrest ksm
Author
First Published Sep 13, 2023, 1:15 PM IST

వైసీపీ ప్రభుత్వం వాళ్లు  అనుకున్నది చేసుకుంటూ పోతున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆలోచనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈరోజు టీడీపీ కార్యాలయంలో పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు.  వైసీపీ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని దృష్టి మళ్లించేందుకు, కక్షపూరితంగా చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు. నాలుగేళ్లలో స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఇన్ని డబ్బులు పోయాయని, చంద్రబాబుకు డబ్బులు ముట్టాయని ఎక్కడ నిరూపించలేదని అన్నారు. 

చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్‌ చేశారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ 16 నెలలు జైలులో ఉన్నారని.. అందుకే కక్షపూరితంగా చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని కక్షపూరితంగా చేశారని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. వైసీపీ నేతలు  కూడా చంద్రబాబు తప్పు చేశాడని నమ్మడం లేదని పయ్యావుల కేశవ్ అన్నారు. ‘‘మావాడు జైలులో పెట్టాలని అనుకున్నాడు.. చేశాడు.. అవినీతి జరిగిందా? లేదా? అనేదానితో సంబంధం లేదు’’ అని వైసీపీ నేతలు కూడా ప్రైవేట్‌గా మాట్లాడుకుంటున్నారని పయ్యావుల అన్నారు. 

స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి ఈడీ, జీఎస్టీలు విచారణ జరిపాయని.. ఎక్కడ కూడా డబ్బులు పోయాయని ఎవరూ చెప్పలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్.. సామాన్లు అన్ని అందినట్టుగా చెప్పారని తెలిపారు. అద్భుతంగా పనిచేసిందని సీమెన్స్‌కు సర్టిఫికేట్ కూడా ఇచ్చారని చెప్పారు. ఒక్క రూపాయి అన్న పక్కకు దారి మళ్లినట్టుగా సీఐడీ అధికారులు నిరూపించారా? అని ప్రశ్నించారు. ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదని తాము చెబుతున్నామని అన్నారు. అలాంటప్పుడు చంద్రబాబుకు డబ్బు వచ్చే అవకాశం ఎక్కడుందని చెప్పారు. సీఐడీ విచారణ కన్నా సజ్జల ఇన్వేస్టిగేషన్ ఎక్కువైందని.. ఆయన చెప్పినదానికి పదింతలు చేసిన ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ చర్యలకు తెలుగుదేశం పార్టీ భయపడదని చెప్పారు. 

సీమెన్స్‌కు, ఈ కేసుకు సంబంధం లేదని అంటున్నారని.. సీమెన్స్‌ ఒప్పందం చేసుకుందని.. ఇప్పుడు తప్పు జరిగిందని చెబుతున్నప్పుడు ఆ సంస్థను ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదని ప్రశ్నించారు. సీమెన్స్ సంస్థను ప్రతివాదిగా చేర్చే ధైర్యం మీకెందుకు లేదని? అన్నారు. సీమెన్స్ సంస్థను ఇప్పటికైనా ప్రతివాదిగా చేర్చగలారా అని ప్రశ్నించారు. సీమెన్స్ సంస్థను ప్రతివాదిగా చేరిస్తే అసలు నిజాలు అన్ని బయటకు వస్తాయని అన్నారు. సీమెన్స్ అంతర్జాతీయ సంస్థ అని.. వాళ్లను ప్రతివాదులుగా చేరిస్తే ఇందులో ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదని స్పష్టంగా చెబుతారని అన్నారు. సీమెన్స్ 90 శాతం ఇచ్చేసిందని మీరు నమ్ముతున్నారా? అని ప్రశ్నించారు. 

వైసీపీ నాయకులు ఎక్కడ పోరాటానికి ముందుకు రారని.. వ్యవస్థలను అడ్డం  పెట్టుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి దమ్ముంటే నాలుగున్నరేళ్లుగా కేసులను వాదించేందుకు న్యాయవాదులకు సంబంధించి పెట్టిన ఖర్చుపై  వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios