Asianet News TeluguAsianet News Telugu

పవన్ కల్యాణ్ పొలిటికల్ స్టైలే వేరు...

పవన్ కల్యాణ్ 2019 నాటికి ఒక  కొత్త రాజకీయ నినాదం  రూపొందించాలనుకుంటున్నారు. ఆయన ఉపన్యాసాలు, ట్వీట్లు దీనికి సాక్ష్యం

pawan  wants Andhras to fight against north hegemony

 

జనసేన నేత పవన్ కల్యాణ్ ఉపన్యాసాలలో కొట్టొచ్చినట్లు కనిపించే విషయం ఉత్తర భారత దురహంకారం. నార్త్ వాళ్లు దక్షిణ భారత దేశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, కించపరుస్తున్నారని,  ఈ ప్రాంతం మీద పెత్తనం చలాయిస్తున్నారనే మాట ఆయన అనంతపురం సభనుంచి స్పష్టంగా, గట్టిగా వినిపించే మాట. ఆయన  వచ్చే ఎన్నికలను ఉత్తర భారత పెత్తనం మీద లేద జులుం మీద యుద్ధంగా మలచబోతున్నాడా...

 

అవుననిపిస్తుంది.

 

జల్లికట్టు మీద నిషేధం ఎత్తివేయాలని తమిళనాడులో పెల్లుబికిన  తమిళ ఆగ్రహంలో ఆయన ఉత్తర భాతర వ్యతిరేకత చూశారు.

 

ఇది ద్రవిడ సాంస్కృతిక వ్యవహారం మీద దాడిగా ఆయన భావిస్తున్నారు.  ఆయన  మనసులో అప్పటికే ఉన్న  ఉత్తర భారత పెత్తనం అనే ధోరణిని ఇది బాగా పటిష్టం చేసింది.

 

ఉత్తర భారత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తాల్సిందే నని ఆయన  సైద్ధాంతీకరిస్తున్నట్లు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి ఉత్తరం మీద దక్షిణం యుధ్దం లా ఎన్నికల నినాదం మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

ఇలాంటి ‘ఉత్తర భారత వ్యతిరేక సెంటిమెంటు రాజకీయాలు’ ఒకపుడు తమిళనాట బలంగా ఉండేవి. తమిళ ఐక్యత పటిష్ట పడి,  తమిళులకు  ప్రత్యేక గుర్తింపు రావడానికి ద్రవిడియన్ ఉద్యమం కొనసాగింపులో భాగంగా వచ్చిన హిందీ వ్యతిరేక ఉద్యమం బాగా పనిచేసింది.

 

ఇవన్నీ ఉత్తర భారత పెత్తనానికి వ్యతిరేకంగా వచ్చినవే. దీనికి వందేళ్ల పునాది ఉంది.

 

ఇటీవల తమిళనాడులో కూడా ఈ భావం పలచబడింది.

 

తెలుగు వాళ్లు ఆంధ్ర పేరుతో  ఒక సారి, తెలంగాణా పేరుతో మరొక సారి ఉద్యమాలు చేసుకుని సొంత రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నారు.  ఇవి కేవలం కేంద్ర ప్రభుత్వ ధోరణులను వ్యతిరేకించాయేతప్ప, ఉత్తరాది పెత్తనం గా కేంద్రం ధోరణిని విమర్శించలేదు.

 

అప్పటి కాంగ్రెస్ గాని, ఇప్పటి టిఆర్ ఎస్ గాని  ఉత్తర భారత వ్యతిరేక సెంటిమెంటును ఉసిగొలిపే ప్రయత్నం చేయలేదు.

 

తెలుగు నాట ఎపుడూ హిందీ వ్యతిరేక ఉద్యమంగాని, ఉత్తరాది ‘పెత్తనం’ వ్యతిరేకత ఒక సెంటు మెంటు స్థాయికి రాలేదు. ఈనార్త్ –సౌత్ ఉద్రేకం తమిళనాడు పొలిమేర దాటి రాలేదు.

 

ఇపుడు, ఉత్తర భారత పెత్తనం, ఉత్తర భారత కేంద్రం అని పవన్ కల్యాణ్ మొట్టమొదటి సారి ఈ నినాదం తీసుకుంటున్నారు.  ఆయన విశ్లేషణ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంఅనేది  ఉత్తరాది పెత్తనం, ఉత్తరాది కేంద్రం దక్షిణాది ఆంధ్ర మీద చూపుతున్న వివక్ష వల్లే.

 

ఈవివరణ వినడానికి బాగుంది.  ఈ  వాదనలో ఒక సౌలభ్యం ఉంది. ప్రత్యేక హోదా రాకపోయేందుకు  ఎవరినీ, అంటే అటు చంద్రబాబుని గాని, ఇటు మోదీని గాని, వక్తులుగా విమర్శించకుండా, ఉత్తర-దక్షిణ రాజకీయంగా చెప్పవచ్చు.

 

అయితే,‘ఉత్తరాది కేంద్రం’ ఆంధ్ర మీద వివక్ష చూపుతూ ఉందనేందుకు పవన్ చాలా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అవసరమే లేదు, కేంద్రంతో తగవు అంతకూ అవసరం లేదంటున్నాడు.

 

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వక పోవడానికి   ఉత్తరాది నేతలు దక్షిణాది నేతలను కించపరస్తున్నారని, ఇది మానుకొనకపోతే, మెడలు వంచుతామని ఈ రోజు ఆయన ట్విట్టరెక్కి ప్రకటించారు. మరి పోలవరం కోసం ప్రత్యేక హోదా వదలుకున్నానంటున్న ముఖ్యమంత్రి మాట ఏమిటి? ప్రత్యేక హోదా రాకపోవడానికి ఎవరు కారణం, వద్దన్న చంద్రబాబా, ఇవ్వనంటున్న మోదీయా?

 

చంద్రబాబు వద్దంటున్న విషయం పట్టించుకోకుండా పవన్  ఇలా ట్విట్టరెక్కారు.

 

‘ఈ నార్త్ ఇండియా నాయకులకు, సౌత్ లో ఎన్ని భాషలున్నాయో తెలుసా?  వాళ్లకి మనమంతా మదరాసీల్లా కనబడుతున్నాం’  అని నిలదీశారు.

 

“గాంధీని ప్రేమిస్తాం, అంబేద్కర్ని అభిమానిస్తాం. పటేల్ కి దండం పెడతాం. రాజ్యాంగాన్ని గౌరవిస్తాం.”

 

కాని,

 

 ‘తల ఎగరేసే ఉత్తరాది నాయకత్వం  దక్షణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పోతే,  చూస్తూ కూర్చోంఉత్తర భారత నీచంగా చూడటం,  అవమానించడం,  వాళ్ల అత్మాభిమానాన్ని దెబ్బతీయం చేస్తే...  వాళ్ల  పొగరెలా  దించాలో మాకూ తెలుసు,’ అని పవన్ చాలా ఘాటుగా విమర్శించారు.

 

రాష్ట్రాల ఏర్పాటుకు , అంటే ఒకపుడు ఆంధ్ర, మరొకసారి తెలంగాణా, ప్రాంతీయ మనోభావం లేదా సెంటుమెంట్ బలంగా పనిచేసింది. అయితే, ఉత్తర దక్షిణ సెంటిమెంటు అంతబలంగా పనిచేస్తుందా? తెలుగువారందరి కాకపోయినా, రంగు రుచి వాసన లేని యాంటినార్త్ ఉద్రేకాన్ని రెచ్చగొడుతుందా  లేద ఇది పవన్ ట్వీట్లకు ఉపన్యాసాలకు పనికొచ్చే స్లోగనేనా...

 

 

Follow Us:
Download App:
  • android
  • ios