చంద్రబాబు నాయుడికి సింగపూర్  ఫిలాసఫీ అర్థంకాలేదు: పవన్ కల్యాణ్వెంకయ్య నాయుడు తెలుగువారిని వంచించాడు, మోసగించాడు.తొలిసారి స్పష్టంగా మాట్లాడిన పవన్ కల్యాణ్

అనేక తడబాట్ల తర్వాత, విమర్శల తర్వాత, జనసేన నేత పవన్ కల్యాణ్ స్పష్టంగా తన దారెటో అనంతపురంలో చెప్పగలిగాడు. ఇదొక కొత్త పరిణామం. అనంతపురంలో జరిగిన రాయలసీమ హక్కుల చైతన్యసభ పవన్ కల్యాణ్ రాజకీయ యాత్రలో ప్రారంభం గా చెప్పవచ్చు. అంతేకాదు, రాష్టంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ లకు కూడా ప్రత్యామ్నయంగా జనసేనను నిలబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు అనంతపురం ప్రసంగం చెబుతున్నది. తెలుగురాజకీయాలలో కఠిన వైఖరి (హార్డ్ లైన్ ) తీసుకొనకపోతే, కాలుమోపేందుకు జాగా దొరకదన్న స్పృహ వచ్చినట్లు స్పష్టమవుతుంది. దీనిని అనంతపురంలో చాలా స్పష్టంగా చెప్పారు.

 ఇక ఆయన బిజెపికి, తెలుగుదేశం పార్టీకి దూరమవుతారని వేరే చెప్పనవసరంలేదు. అనంతపురం సభలో పేరు చెప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, పేరు తీసి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు ప్రాక్టికల్ లీడర్ కాదని అర్థం వచ్చేలా చెబుతూ సింగపూర్ ఫిలాసపీ ఆయనకు అర్థం కాలేదని అన్నారు. సింగపూర్ జాతిపిత లీ క్వాన్ యూ ని చంద్రబాబు అర్థంచేసుకోలేకపోయారనేది ఒక సీరియస్ నిందారోపణ. బ్లాస్ఫెమీ. ’సింగపూర్ అంటే ఆకాశ హ ర్మ్యాలు కాదు, వెడల్పయిన రోడ్లు కాదు. అవినీతి లేని పరిపాలన. లీ క్వాన్ యూ అవినీతిని నిర్మూలించాడు. ఈ విషయంలో ఎవరినీ లెక్క చేయలేదు. చివరకు సన్నిహితులను కూడా జైలులో తోసేశాడు. అవినీతి నిర్మూలించకుండా అభివృద్ధి సాధ్యం కాదు,’ అన్నాడు. దీనిభావమేమిటి? చంద్రబాబు కు అంతీసీన్ లేదనే కదా.

ఇంక వెంకయ్యనాయుడి మీద విరుచుకుపడ్డానే చెప్పాలి. నిస్సంకోచంగా, తడబాటు లేకుండా,నీళ్లు నమలకుండా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలుగుప్రజలను వంచించాడు, మోసం చేశాడు అని తీర్పులాగా చెప్పాడు. గత సభలో ప్యాకేజీ పాచిన లడ్డు అన్నందుకు ఇటీవల వెంకయ్య నాయుడ వేసిన సటైర్లకి పవన్ జవాబు చెప్పాడు. 

ప్యాకేజీ మోసం అన్నాడు. జైట్లీ తో కలసి తిరుగుతున్నా, రాష్ట్రానికి అందిస్తున్న ప్యాకేజీ విషయంలో వెంకయ్యకు క్లారిటీ లేదని చెబుతూ జైట్లీ ప్యాకేజీ బరువు రు. 2.03 లక్షల కోట్లంటే, వెంకయ్య ప్యాకేజీ రు. 2.25 లక్షల కోట్లకు పెరిగింది. ఒకే సభలో మాట్లాడే వారి మధ్య 22 వేల కోట్ల వ్యత్యాసమా అంటూ అందుకే ప్యాకేజీ ఒక మాటల మూట మాత్రమే అన్నాడు. 

ఇట్లాంటి పనికి మాలినిప్యాకేజీని ప్రకటించి వూరూర సన్మానాలా అని అడిగాడు. చేసే వాడికి మతి లేకపోతే, చేయించుకు నేవాడికి ఉండనవసరం లేదా అని ప్రశ్నించాడు.

’ ఏమిటీ ఖాళీ మూట, ఇలా అన్యాయం చేయడం తగునా ’ అని తను అమితంగా అభిమానించే ప్రధాని మోడీని కలుసుకుని విన్నవించేందుకు అపాయంట్మెంట్ అడిగితే ఇంకా రాలేదన్నారు. రాకపోవచ్చు కూడా.

చాలా విషయాల్లో పవన్ స్పష్టత చూపడం అనంతపురం సభ విశేషం. బస్సులు లారీలు వేసి తోలకపోయినా జనం విరగబడి వచ్చారనక తప్పదు. ఆయన నుంచి ఇలాంటి రాజకీయస్పష్టత వుండాలని ప్రజలు చాలా కాలంగా ఆశిస్తూ వస్తున్నారు. నిజానికి, ఆయన రాసిన పుస్తకాలు దండగ. రాబోయేది ఇంకా దండగ. పుస్తకాలు, అనంతపురం సభ లాంటి సభలు వూరూర జరగాలి. సభకంటే, స్పష్టమయిన ఉపన్యాసం కంటే విశదమయిన పుస్తకమేమీ ఉండదు. పుస్తకం పీస్ టైం యాక్టివిటి.

అనుమానం లేదు, జనసేన పవన్ సమర శంఖం పూరించినట్లే లెక్క. ఇతర ప్రతిపక్ష పార్టీలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకుంటాడో ఆయన ఇంకా వెల్లడించలేదు. ప్రతిపక్ష పార్టీలతో ఆయన సంబంధాలను బట్టి తెలుగుదేశం జయపజయాలు ఉంటాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలు, అవినీతి రహిత పాలన ధ్యేయంతో ముందుకు పోవాలనుకుంటే ఈ విషయంలో పవన్ జాగ్రత్తగా అడుగేయాలి. లేదంటే, అను ప్రత్యర్థి అనుకుంటున్న వారిని గెలిపించేందుకు పరోక్షంగా సహకరించినట్లవుతుంది.