సుగాలి ప్రీతి కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. జగన్ తీసుకున్న నిర్ణయంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. మూడేళ్ల కిందట పాఠశాలకు వెళ్లిన ప్రీతి అత్యాచారం, హత్యకు గురైందని, ఆమె తల్లిదండ్రులు కడుపు కోత, ఆవేదనకు గురయ్యారని పేర్కొన్నారు. తమ బిడ్డ కేసులో న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు పడిన కష్టం పగవాడికి కూడా రాకూడదని పవన్ అన్నారు.

Also Read అమరావతి సెగ.. చిరంజీవి నివాసం వద్ద భారీ భద్రత...

కర్నూలు జిల్లాలో మూడు సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించిన విద్యార్థిని సుగాలి ప్రీతి కేసు విషయంలో జగన్ సర్కార్ సంచల నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జగన్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించారు.

  2017లో సుగాలి ప్రీతి మరణించిన విషయం తెలిసిందే. కర్నూలు లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న రాజు నాయక్, పార్వతి దంపతుల కుమార్తె ఆమె. దిన్నెదేవరపాడు సమీపంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని. ఈ రెసిడెన్షియల్ పాఠశాాల తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడిదనే ఆరోపణలు ఉన్నాయి. 2017 ఆగస్టు 19వ తేదీన సుగాలి ప్రీతి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించారు.

ఆత్మహత్య అని అందరూ కొట్టిపారేయగా.. హత్యాచారం చేసి చంపేశారంటూ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం ఈ మూడు సంవత్సరాలుగా వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత కాలం క్రితం బాలిక తల్లిదండ్రులు న్యాయం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిశారు.

వారి ఆవేదనను అర్థం చేసుకున్న పవన్... సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగించాల్సిందేనని పట్టుపట్టారు. ఈ క్రమంలో కర్నూలులో ర్యాలీ కూడా తలపెట్టారు. ఈ నేపథ్యంలో.. జగన్ ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.