అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎ.పి.పి.ఎస్.సి.) నుంచి నోటిఫికేషన్ వస్తే చెప్పిన తేదీల్లో... ఎలాంటి వివాదాలు, న్యాయపరమైన చిక్కులు లేకుండా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తారనే నమ్మకాన్ని యువత కోల్పోతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎ.పి.పి.ఎస్.సి. ప్రతి యేటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదని ఆయన విమర్శించారు. 

 ప్రణాళిక లేకుండా ఉండటంతో నిరుద్యోగుల్లో ఎ.పి.పి.ఎస్.సి. ద్వారా అయ్యే ఉద్యోగాల భర్తీ విషయంలో నిరాశానిస్పృహలు ఏర్పడుతున్నాయని అన్నారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్ళు అయిందని, ప్రిలిమ్స్ పరీక్షల  పత్రంలో 51 తప్పులు వచ్చాయని  నిరుద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఎపిపీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్ ఏమైందని ఆయన జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

నిరుద్యోగుల అభ్యంతరాలను ఎ.పి.పి.ఎస్.సి. పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని, ఈ నెలలో మెయిన్స్ నిర్వహణకు కమిషన్ సన్నద్ధం అయిందని ఆయన చెప్పారు. అదే సమయంలో ఇతర ఉద్యోగాలతోపాటు ఉన్నత విద్య అర్హత పరీక్షలు ఉన్నందున గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణ తేదీలు మార్చాలని ఉద్యోగార్థులు జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. 

ఎ.పి.పి.ఎస్.సి. ప్రణాళిక లేకుండా వ్యవహరించడం, పరీక్ష తేదీలను ప్రకటించేటప్పుడు ఇతర నోటిఫికేషన్ తేదీలను పరిగణించకపోవడం వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన చెందారు. ఎ.పి.పి.ఎస్.సి. ఉన్నతాధికారులు నిరుద్యోగ యువత ఆవేదనను మానవతా దృక్పథంతో పరిశీలించాలని ఆయన కోరారు. 

ఇతర ఉద్యోగాలకు సైతం సన్నద్ధం అవుతూ ఉంటారని, ఒక పరీక్ష కోసం మరొకటి వదులుకొనే పరిస్థితి రాకూడదని ఆయన అన్నారు కాబట్టి గ్రూప్ 1 తేదీలను వాయిదా వేస్తే యువతలో ఆందోళన తగ్గుతుందని సూచించారు. వివాదాలకు తావు లేకుండా నోటిఫికేషన్లు ఇచ్చి, తప్పులకు ఆస్కారం లేకుండా పరీక్షలను ఎ.పి.పి.ఎస్.సి. నిర్వహించాలని ఆయన కోరారు.