Asianet News TeluguAsianet News Telugu

ఈ స్థితిలో కన్నాపై విమర్శలా, చిల్లర రాజకీయాలు: పవన్ కల్యాణ్

కరోనా వైరస్ ను అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రస్తుత తరుణంలో బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణపై అధికార పార్టీ వైసీపీ నేతలు విమర్శలు చేయడాన్ని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తప్పు పట్టారు.

Pawan Kalyan warns political parties
Author
Vijayawada, First Published Apr 22, 2020, 12:57 PM IST

విజయవాడ:  ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనా కొందరు అధికార పార్టీ పెద్దలు దృష్టి పెట్టినట్లు గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలియచేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచాన్ని క్రమక్రమంగా ఆక్రమిస్తున్న కరోనా కారణంగా అగ్రరాజ్యాలుగా పేరుపొందిన దేశాలు చేష్టలుడిగి చిగురుటాకుల్లా వణికిపోతున్నాయని ఆయన అన్నారు. 

ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. అన్ని వసతులూ ఉన్న అగ్రరాజ్య ఆసుపత్రులు రోగులందరికీ సేవలు అందించలేక  నానా అవస్థలు పడుతున్నాయని ఆయన అన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మందులను పంపమని భారతదేశాన్ని ప్రాధేయపడుతున్నాయని గుర్తు చేశారు. ఇంకో పక్క పెట్రోల్ ధరలు పాతాళంలోకి జారిపోయి చమురు ఉత్పత్తి దేశాలు దిక్కులు చూస్తున్నాయని అన్నారు. 

ఈ పరిణామాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనపైన ప్రభావం చూపేవే అని ఆయన అన్నారు. ఇక మన దేశంలో లక్షలాదిమంది కార్మికులు ముఖ్యంగా వలస కార్మికులు ఉపాధి కోల్పోయి, ఊరుకాని ఊరిలో వుంటూ అర్ధాకలితో అలమటిస్తున్నారని, రైతులు తమ పంటను అమ్ముకునే దారి లేక  పెంటకుప్పల్లో పోస్తున్నారని ఆయన చెప్పారు. 

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ ను సైతం విడిచిపెట్టలేదని, కేసులు పెరుగుతున్న తీరుచూస్తే ఈ మహమ్మారి ఎప్పటికి శాంతిస్తోందో ఊహకు అందడం లేదని ఆయన అన్నారు. గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు పెరుగుతున్న పాజిటివ్  కేసులు చూసి బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. ప్రపంచం అంతా ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో తప్పులు వేలెత్తి చూపేవారిపై బురద చల్లే కార్యక్రమాన్ని అధికార పార్టీ పెద్దలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. 

అత్యవసర వైద్య సేవలు అందించవలసిన తరుణంలో రాజకీయాలను భుజాలకు ఎత్తుకున్నారని ఆయన అన్నారు. బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారిపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయని అన్నారు. ఆయనపై జరుగుతున్న  వ్యక్తిత్వహనన దాడి ప్రజాస్వామ్యవాదులు ఖండించవలసిన రీతిలో, ఆయనకు క్షమాపణలు చెప్పాలని అడిగే స్థాయిలో ఉందని అన్నారు. 

ఈ ఆపత్కాల సమయంలో జనసేన పార్టీ అందరినీ కోరుతున్నది ఒక్కటే... కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదామని అన్నారు. చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందామని చెప్పారు. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై  మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దామని సూచించారు. ఇప్పటివరకు అయినది చాలునని, ఈ సమయంలోనైనా  రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం వుందని ఆయన హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios