అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ టికెట్ల ధరల వివాదం కొనసాగుతోంది. సినిమా విడుదలైన రెండు రోజుల వరకే టికెట్ ధరలు పెంచుకోవచ్చునని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో మరోసారి కోర్టుకు రానుంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వకీల్ సాబ్ సినిమా టికెట్ల ధరల పెంపునకు, బెనిఫిట్ షోలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతించని విషయం తెలిసిందే. దీనిపై డిస్ట్రిబ్యూటర్లు కోర్టుకు ఎక్కడంతో టికెట్ల ధరల పెంపునకు అనుమతి లభించింది. దానిపై ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. సినిమా విడుదలైన తర్వాత రెండు రోజుల వరకు మాత్రమే టికెట్ ధరలు పెంచుకోవచ్చునని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో టికెట్ల ధరల పెంపునకు అవకాశం లేకుండా పోయింది.

ఈ స్థితిలో వకీల్ సాబ్ ధరల పెంపును అనుమతించాలని కోరుతూ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కొత్త జీవో వచ్చేవరకు పాత జీవోను అమలు చేయాలని న్యాయవాది కోరనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతి ఇవ్వలేదు.

దాంతో పవన్ కల్యాణ్ అభిమానులు రెచ్చిపోయారు. పలు థియేటర్లపై దాడులు చేశారు. ఆందోళనలకు దిగారు. ఆ విషయంపై బిజెపి నేతలు సునీల్ దియోధర్, సత్య వంటి నాయకులు వైఎస్ జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.