నేటి నుండి విశాఖ నుండి పవన్ వారాహి యాత్ర: పోలీసుల ఆంక్షలు
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ్టి నుండి మూడో విడత వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ పై పోలీసుల నుండి స్పష్టత రావాల్సి ఉందని జనసేన నేతలు చెబుతున్నారు.
విశాఖపట్టణం:జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ్టి నుండి మూడో విడత వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. విశాఖ పట్టణంలోకి పవన్ కళ్యాణ్ ప్రవేశించే రూట్ మ్యాప్ పై పోలీసుల నుండి ఇంకా స్పష్టత రావాల్సి ఉందని జనసేన నేతలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతిని నిన్న ఇచ్చారు.
ఇదిలా ఉంటే 30 పోలీస్ యాక్టు అమల్లో ఉందని పోలీసులు ప్రకటించారు. నేషనల్ హైవే రహదారి గుండా పవన్ కళ్యాణ్ ను విశాఖపట్టణంలోకి ప్రవేశిస్తే ట్రాఫిక్ కు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయంతో పోలీసులున్నారనే ప్రచారం సాగుతుంది. పోర్ట్ రోడ్డు గుండా పవన్ కళ్యాణ్ ను విశాఖ పట్టణంలోకి ప్రవేశించేందుకు అనుమతించే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయాలపై పోలీసుల నుండి స్పష్టత లేదని జనసేన నేతలు చెబుతున్నారు. ఇవాళ్టి నుండి ప్రారంభమయ్యే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగుతుంది.
ఈ ఏడాది జూన్ 14న తూర్పు గోదావరి జిల్లాలో కత్తిపూడి జంక్షన్ వద్ద వారాహి యాత్ర తొలి విడతను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అదే నెల 30వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగింది. మరో వైపు ఈ ఏడాది జూలై 9న ఏలూరు నుండి రెండో విడత యాత్రను ప్రారంభించారు. అదే నెల 14న భీమవరంలో యాత్రను ముగించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్‌సీపీకి ఓక్క సీటు కూడ వచ్చే ఎన్నికల్లో దక్కకూడదని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు.ఈ దిశగా జనసేన నాయకత్వం వ్యూహం అమలు చేయనుంది. మరో వైపు ఇవాళ్టి నుండి విశాఖపట్టణం జిల్లాలో పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. అర్బన్ సమస్యలతో పాటు ఉత్తరాంధ్ర సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రస్తావించనున్నారు.