సారాంశం

వారాహి యాత్రకు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హోమం చేయనున్నారు. ఇందుకోసం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఈ నెల 14 నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ముందుగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. అయితే తన యాత్రకు దైవ బలం కూడా పొందేందుకు పవన్ హోమం చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా జూన్ 13న మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో హోమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలు చేస్తున్నారు. 

కాగా.. వారాహి యాత్రకు  సంబంధించిన  పోస్టర్ ను  జనసేన  పొలిటికల్  ఎఫైర్స్ కమిటీ  ఛైర్మెన్  నాదెండ్ల మనోహర్  సోమవారంనాడు విడుదల  చేశారు. తూర్పు  గోదావరి  జిల్లా నుండి  పవన్ కళ్యాణ్  యాత్రను ప్రారంభించనున్నారు. అన్నవరం  ఆలయంలో  ప్రత్యేక పూజలు  నిర్వహించిన  తర్వాత తూర్పు గోదావరి  జిల్లాలోని పిఠాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం,కాకినాడ అర్బన్ , కాకినాడ  రూరల్, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. ఆ తర్వాత  పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ యాత్ర  నిర్వహించనున్నారు. 

Also Read: కత్తిపూడి జంక్షన్ నుండి పవన్ వారాహి యాత్ర: నాదెండ్ల మనోహర్

ఉభయ గోదావరి జిల్లాలో తమ పార్టీకి ఎక్కువగా బలం  ఉంటుందని జనసేన భావిస్తోంది. అందుకే  ఈ  జిల్లాల్లో  పవన్ కళ్యాణ్  యాత్ర  నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని  అన్ని వర్గాల  ప్రజలతో  పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇందుకోసం ప్రతి  నియోజకవర్గంలో జనవాణి  కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.