విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం బిజెపి నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశం కోసం ఆయన హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. కొద్దిసేపట్లో ఆయన బిజెపి నేతలతో సమావేశం అవుతారు.

బిజెపి నుంచి కన్నా లక్ష్మీనారాయణ, సునీల్ ధియోధర్, జీవీఎల్ నరసింహారావు, దగ్గుబాటి పురంధేశ్వరి, సోము వీర్రాజు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటికే ఏపీ బిజెపి నేతలు పురంధేశ్వరి, సోము విర్రాజు పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. 

Also Read: 16న భేటీ: బీజేపీతో కలిసి జగన్ పై పోరుకు పవన్ కల్యాణ్ వ్యూహరచన

పవన్ కల్యాణ్ తో పాటు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సమావేశానంతరం సాయంత్రం 3 గంటలకు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది.

పవన్ కల్యాణ్ ఇటీవల ఢిల్లీ వెళ్లి ఆర్ఎస్ఎఎస్ నేతలతో సమావేశమయ్యారు. అంతేకాకుండా బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో కూడా సమావేశమయ్యారు. బిజెపితో కలిసి పనిచేయడానికి పవన్ కల్యాణ్ సూత్రప్రాయంగా అంగీకరించారు. దీంతో గురువారంనాటి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. 

Also Read: జగన్ మీద ఫైట్: బిజెపి అస్త్రం పవన్ కల్యాణ్, చంద్రబాబు వెనక్కి

రాజధానిని అమరావతి నుంచి తరలించకూడదని బిజెపి రాష్ట్ర నేతలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కూడా వారు కోరారు. ఈ నేపథ్యంలోనే బిజెపితో కలిసి పవన్ కల్యాణ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

అయితే, మూడు రాజధానుల ప్రతిపాదనపై వైఎస్ జగన్ ఇప్పటి వరకు తన వైఖరి చెప్పలేదు. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర శానససభ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ ప్రత్యేక సమావేశంలో మూడు రాజధానుల ప్రతిపాదనపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ మేరకు శాసనసభలో ఓ బిల్లును ప్రతిపాదించే అవకాశం కూడా ఉంది.

బిజెపి నేతలతో సమావేశం కావడానికి ముందు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఫార్చ్యూన్ మురళీ హోటల్ లో ఈ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు, రాజధాని అంశం, ప్రజా సమస్యలపై బిజెపి నేతలతో జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.