అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏకిపారేశారు. ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్తాకథనాలను, సంపాదకీయాలను ట్విట్టర్ లో పోస్టు చేసి జగన్ పాలనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సిఎం జగన్ వి తిరోగమన రాజకీయాలని, పరిపాలనలో ఆయనకు ఒక దృక్కోణం కావాలని శీర్షికలను పెట్టారు. 

ఏపీలో జగన్ పరిపాలన పగ తీర్చుకునే విధంగా, సరైన కొలమానం లేకుిండా సాగుతోందని పవన్ కల్యాణ్ అన్నారు. దేశంలోనే యువ ముఖ్యమంత్రుల్లో ఒక్కరైన 47 ఏళ్ల వయస్సు గల జగన్ రెడ్డి పరిపాలన భయాందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. 

 

రాష్ట్రంలో చంద్రబాబు ముద్ర లేకుండా బాహాటంగా చేపడుతున్న వరుస చర్యల్లో భాగంగా రాజధాని అమరావతిలో 6.84 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ స్టార్టప్ కోసం సింగపూర్ కన్సార్షియంతో సిఆర్డీఏ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారని ఆయన తెలిపారు. ఈ స్టార్టప్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్లే అండ్ ప్లగ్ కార్యాలయాలు పూర్తయి ఉఇంటే 50 వేల ఉద్యోగాలు లభించేవని ఆయన అన్నారు. 

 

జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు కోరుకున్న రీతిలో ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని అభినృద్ధిని చేయడం ఇష్టం లేదని, అందులో భాగంగానే స్టార్టప్ రద్దును చూడాలని ఆంగ్ల పత్రిక రాసిన వ్యాసాన్ని ఉటంకించారు. 

అమరావతిలో స్టార్టప్ ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, వర్తమాన భారతదేశానికి అత్యావశ్యకమైన పట్టణాభివృద్ధికి పెద్ద విఘాతమని, ఈ నిర్ణయం భారత్ లోని విదేశీ పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బ తీసిందని, రాష్ట్రాభివృద్ధి కోసం సిఎం జగన్ వెంటనే తన నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించుకోవాలని అని అంటూ రాసిన వార్తాకథనాన్ని కూడా పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.