అమరావతి: తమతో పొత్తు కోసం వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం నాడు విజయవాడలో జరిగిన కృష్ణా జిల్లా కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్  సంచలన వ్యఖ్యలు చేశారు.జనసేనకు బలం లేదనే నేతలే... జనసేనతో పొత్తు కోసం  రాయబారాలు చేస్తున్నారని వైసీపీ నేతలనుద్దేశించి పవన్ కళ్యాణ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

 పొత్తు కోసం  టీఆర్ఎస్‌ నేతలతో రాయబారాలు నడిపిస్తున్నారని పరోక్షంగా  వైసీపీ పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.. బలం లేదంటూనే ఎందుకు పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

2014 ఎన్నికల సమయంలో టీడీపీకి మద్దతు ఇవ్వడం వ్యూహంలో భాగమేనని ఆయన అభిప్రాయపడ్డారు. 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కావాలని జగన్  కలలు కంటున్నారని, మరోసారి ఏపీకి  సీఎం కావాలని చంద్రబాబునాయుడు పోస్టర్లు వేయించుకొంటున్నారని ఆయన చెప్పారు.కానీ, వీరిద్దరికి జనం బాధలు పట్టడం లేదన్నారు.

ఇదిలా ఉంటే జనసేన సమావేశంలో  టీఆర్ఎస్ నేతల రాయబారాల గురించి పవన్ కళ్యాణ్ చేసిన  వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించనున్నాయి..ఏపీ రాజకీయాల్లో  జనసేన పాత్ర కీలకంగా మారనుందని పవన్ కళ్యాణ్ క్యాడర్ కు తేల్చి చెప్పారు.

టీఆర్ఎస్‌తో వైసీపీకి సత్సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధిస్తే ఏపీలో వైసీపీ నేతలు సంబరాలు చేసుకొన్నారు. ఈ విషయాన్ని  చంద్రబాబు సహా పలువురు నేతలు ప్రస్తావిస్తున్నారు.

ఏపీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఈ రిటర్న్ గిఫ్ట్‌లో భాగంగా చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా వైసీపీకి టీఆర్ఎస్ మద్దతిచ్చే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది. ఏపీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ వైసీపీ తరపున ప్రచారం చేసినా తమకు అభ్యంతరం కూడ లేదని బాబు ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్‌కు జగన్ సానుకూల సంకేతాలను ఇచ్చారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కేసీఆర్ లేఖ రాస్తానని చెప్పడం జగన్ స్వాగతించడం కూడ ఈ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాలను బట్టబయలు చేస్తున్నాయని టీడీపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.అయితే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.