Asianet News TeluguAsianet News Telugu

బతికున్నంత వరకు జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయను.. గెలిచినా, ఓడినా ముందుకే : పవన్ సంచలనం

తాను బతికున్నంత వరకు జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయనని స్పష్టం చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. జనసేన నుంచి ఎవరు అభ్యర్ధిగా నిలబడ్డా , వారిలో తనను చూడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు
 

pawan kalyan sensational comments on janasena merging in another political party
Author
Mandapeta, First Published Jul 16, 2022, 9:45 PM IST

జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా (konaseema district) మండపేటలో కౌలు రైతు భరోసా యాత్ర (koulu rythu bharosa yatra) జరిగింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... తన ప్రాణం ఉన్నంత వరకు పార్టీని విలీనం చేయనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా తన ప్రయాణం ఆగదని పవన్ వెల్లడించారు. జనసేన ముందుకు సాగుతూనే వుంటుందని.. జనసేన నుంచి ఎవరు అభ్యర్ధిగా నిలబడ్డా , వారిలో తనను చూడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మావాళ్లు తప్పు చేసినా.. తానే దోషిగా నిలబడతానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

మార్పు రావాలంటే గోదావరి జిల్లాలతోనే సాధ్యమన్న ఆయన.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తి గోదావరి జిల్లాలకు వుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరివైపు నిలబడతారో గోదావరి జిల్లాల ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా అని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. చెల్లించే పన్నులనే ప్రభుత్వం ప్రజలకు ఇస్తోందని.. ప్రభుత్వంలో లేకపోయినా కౌలు రైతులకు సాయం చేస్తున్నామని ఆయన అన్నారు. కౌలు రైతుల కుటుంబాలకు ఇప్పటికే కోట్లాది రూపాయల సాయం చేశామని పవన్ గుర్తుచేశారు. రూ. 7 లక్షల బీమా సొమ్ము కౌలు రైతులకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ALso REad:రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది గోదావరి జిల్లాలే.. వచ్చే ఎన్నికల్లో ఎవరి వైపో మరి : పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

అంబేద్కర్‌ను తాను స్పూర్తిగా తీసుకున్నానని.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు సీఎం ఇష్టపడటం లేదని పవన్ ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంతబాబు కేసును మభ్యపెట్టేందుకే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టారని జనసేనాని దుయ్యబట్టారు. తెలంగాణలో నా తెలంగాణ అనే భావన వుందని.. కులమనే భావన ఏపీలో వుందని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాన్ని గౌరవిస్తూ , కులానికి అతీతంగా ఆలోచించాలని.. జేబులో డబ్బు తీసి ఇవ్వడం తమకు సరదా కాదన్నారు. అంబేద్కర్, మహాత్మా గాంధీలు జగన్ లాగా పాదయాత్రలు చేయలేదని, ముద్దులు పెట్టలేదంటూ సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 

ఆర్టికల్ 370ని తాత్కాలికంగా మాత్రమే అంబేద్కర్ పెట్టారని, అందువల్లే బీజేపీ ప్రభుత్వం దానిని తొలగించగలిగిందన్నారు. తాను చేయాల్సినవన్నీ రాజ్యాంగం ద్వారా అమలు చేయగలిగేలా అంబేద్కర్ చేశారని పవన్ ప్రశంసించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే మొట్టమొదట స్వాగతించింది జనసేన మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల పైచిలుకు మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే .. ప్రభుత్వం కేవలం 7 వందల మందికే సాయం చేసిందని పవన్ దుయ్యబట్టారు. జనసేన నేతలకున్న సిమెంట్ ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, ఆస్తుల నుంచి కాకుండా ప్రభుత్వ ఖజానా నుంచే తాము సాయం చేయమని అడుగుతున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios