కుప్పంలో కూడా నిరసన కవాతు చేస్తా, ఏమైనా సరే: పవన్ కల్యాణ్

Pawan Kalyan says he will disclose strategy in August
Highlights

 తమ పార్టీ నాయకులను ఎలా గెలిపించుకోవాలి, పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే విషయాలను ఆగస్టులో వివరంగా చెప్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

శ్రీకాకుళం: తమ పార్టీ నాయకులను ఎలా గెలిపించుకోవాలి, పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే విషయాలను ఆగస్టులో వివరంగా చెప్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదాపై తమ పార్టీ చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. కేంద్రం మనకు సంజాయిషీ చెప్పి, నిధులిచ్చి రాష్ట్రాభివృద్ధికి మార్గం చూపించే వరకు 175 నియోజకవర్గాల్లో నిరసన కవాతు చేస్తూనే ఉంటానని అన్నారు. 

 తాను గాయపడినా, కిందపడినా, తనపై దాడులు జరిగినా నిరసన కవాతును ఆపేది లేదని చెప్పారు. ఆఖరికి కుప్పంకు కూడా వెళ్లి కవాతు చేస్తానని, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా నిరసన కవాతు చేసి తీరుతానని అన్నారు. అక్కడ ఎలాంటి ప్రతికూల పరిస్థితులను కల్పించినా సమర్థవంతంగా ఎదుర్కొంటానని అన్నారు. 
ఇకనైనా మొసలి కన్నీరు కార్చకుండా ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. పోరాట యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఆయన ఆదివారం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు

అండగా ఉంటారని మద్దతిస్తే తమ పార్టీ కార్యకర్తలపైనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాడులకు దిగుతున్నారని ఆయన టీడిపిపై విరుచుకుపడ్డారు. అనుభవం ఉందని, పేద ప్రజలకు అండగా ఉంటారనే 2014లో చంద్రబాబుకు మద్దతిచ్చాననని, అంతే తప్పపదవులు ఆశించి కాదని చెప్పారు. 

అయితే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, తమ పార్టీ కార్యకర్తలపైనే దాడులు చేయిస్తున్నారని అన్నారు. జనసైనికులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. 

తాము అధికారంలోకి వస్తే శత్రువులకు కూడా న్యాయం చేస్తామని ఆయన చెప్పారు.  జనసేనకు 15 సీట్లు వస్తాయని అవహేళన చేస్తున్నారని, అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదుని, సీట్లు తాము ఇస్తే వారు తీసుకోవాలని అన్నారు.

loader