తాడేపల్లిగూడెం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి రెడ్లంతా అలాగే ఉన్నారని అనుకోవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రెడ్లలో కూడా పేదరికం ఉందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ఆయన సోమవారం సాయంత్రం ప్రసంగించారు. 

అన్ని కులాల్లోనూ పేదరికం ఉందని, కమ్మల్లో కూడా పేదరికం ఉందని, అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లు కావాలనే పరిస్థితి వచ్చిందని, కాపులు రిజర్వేషన్లు కావాలంటున్నారని మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవని ఆయన న్నారు. ఆడపడుచులకు రిజర్వేషన్లు కల్పించాలనే అంశాన్ని తమ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టామని చెప్పారు.  

జగన్, చంద్రబాబు మహిళలకు సీట్లు ఇస్తున్నామంటే తమ కుటుంబంలోని మహిళలకు ఇవ్వడం కాదని, అభివృద్ధికి దూరంగా ఉన్న మహిళలకు ఇవ్వాలని ఆయన అన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు తగిన సాయం అందిస్తామని, అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా వెనకబడినవారికి సాయం అందించడానికి ఒక్కో కులానికి ఒక్కో కార్పోరేషన్ ఏర్పాటు చేయాలా, అన్ని కులాలకు కలిపి ఒక్క కార్పోరేషన్ ఏర్పాటు చేయాలా అనే విషయాన్ని ఆలోచిస్తున్నామని ఆయన వివరించారు. 

జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని టీడీపీవారు అంటుంటే, టీడీపీ వాళ్లు లక్షన్నర కోట్లు దోచుకున్నారని వైసిపివాళ్లు అంటున్నారని, దాన్ని బట్టి వాళ్లు ఎంత దోచుకుంటున్నారో అర్థం చేసుకోవాలని, జనసేనకు డబ్బులు అవసరం లేదని అన్నారు. మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ఆయన చెప్పారు. చౌకధర దుకాణాల ద్వారా బియ్యాన్ని ఇచ్చే బదులు మహిళ ఖాతాల్లో 2 వేలు లేదా రెండున్నర వేలు వేస్తామని, దానివల్ల వారికి ఇష్టమైంది కొనుక్కోవడానికి వీలు కలుగుతుందని అన్నారు.  

ముస్లింల కోసం సచార్ కమిటీ నివేదికను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కచ్చితంగా వారికి అందేలా చూస్తామని చెప్పారు. కులాన్ని బట్టి హాస్టల్స్ ఏర్పాటు చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. దేశంలో సమైక్యతా భావం పెంపొందాలంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే అందుకు తగిన భావజాలాన్ని అందించాల్సి ఉంటుందని, బీసీ, ఎస్సీ హాస్టల్స్ అంటూ వేర్వేరు హాస్టల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఆ భావాన్ని పెంపొందించలేమని అన్నారు. అన్ని కులాలకు కలిపి ఒకే విధమైన హాస్టల్స్ విధానాన్ని ఏర్పాటు చేసే విషయంపై కూడా ఆలోచన చేస్తున్నామని అన్నారు. దివ్యాంగులకు ఏ విధమైన మేలు చేయాలనే విషయంపై ఆలోచిస్తున్నామని చెప్పారు.