జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పవన్ కల్యాణ్‌కు జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పవన్ కల్యాణ్‌కు జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. దీంతో పవన్ కల్యాణ్ జనసేన కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో.. ఎయిర్‌పోర్టు వద్ద థింసా నృత్యం, తప్పెటగుళ్ళు, కోలాటం లాంటి సంప్రదాయ కళాకారుల ప్రదర్శనలు నిర్వహించడంతో అక్కడ కోలాహలం నెలకొంది.
పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో.. ఆ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపడుతున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, తాటిచెట్ల పాలెం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్, ఎన్టీఆర్ విగ్రహం (బీచ్ రోడ్) మీదుగా నోవాటెల్ వరకు జనసేన ర్యాలీ చేపట్టనున్నారు. తన పర్యటనలో భాగంగా నేడు విశాఖపట్నం అర్బన్, రూరల్ పరిధిలోని జనసేన ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జనసేన భవిష్యత్తు కార్యాచరణపై పవన్ కల్యాణ్ పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
రేపు (అక్టోబర్ 16) ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీ నిర్వహించే జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సమస్యలపై వచ్చే ఆర్జీలను పవన్ కల్యాణ్ స్వీకరించనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అక్కయపాలం హైవే రోడులోని పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నట్టుగా జనసేన వర్గాలు తెలిపాయి.
ఇక, రేపు సాయంత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 17వ తేదీ ఉదయం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం బీచ్ రోడ్డులోని వైఎంసీఏ హాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశం కానున్నారు.
