అభివృద్ధి రెండు కులాలకే, తన్ని తరిమేస్తారు: పవన్ కల్యాణ్

అభివృద్ధి రెండు కులాలకే, తన్ని తరిమేస్తారు: పవన్ కల్యాణ్

శ్రీకాకుళం: ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ధర్మపోరాటమే చేస్తారో, ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలనే చూస్తారో తేల్చుకోవాలని ఆయన అన్నారు. 

ఉద్దానం కిడ్నీ బాధితులపై చేపట్టిన 24 గంటల దీక్షను ఆయన శనివారం సాయంత్రం విరమించారు. కిడ్నీ బాధితుల కుటంబం ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

పుష్కరాలకు 2 వేల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు నిధులు లేవని అంటున్నారని ఆయన అన్నారు. ప్రజల్లో చైతన్యం కోసమే జనసేన పోరాటం చేస్తుందని చెప్ాపరు. తనకు ప్రజల బాగే తప్ప జనసేన బాగు ముఖ్యం కాదని అన్నారు. 

అభివృద్ధి ఫలాలు రెండు కులాలకే దక్కుతున్నాయని ఆయన మండిపడ్డారు. అధికారం రెండు కులాల గుప్పిట్లోనే ఉందని ఆయన అన్నారు. మనం ఏం చేసినా ప్రజలు భరిస్తారని అనుకోవడం సరికాదని, ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజు తన్ని తరిమేస్తారని ఆయన హెచ్చరించారు. 

ఉద్ధానం బహిరంగ సభకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం పోలీసు, రెవెన్యూ శాఖలను ఆదేశించిందని ఆయన విమర్శించారు. తాను రాజకీయ గుర్తింపు కోసం నిరసన పోరాట యాత్ర చేయడం లేదని, గుర్తింపు కోసం చేసేవాడినైతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఉండేవాడిని కానని, రాష్ట్రానికి మేలు జరుగుతుందనే టీడీపికి మద్దతు ఇచ్చానని ఆయన వివరించారు. 

శ్రీకాకుళం వెనకబడిన ప్రాంతం కాదని, వెనక్కి నెట్టేయబడిన ప్రాంతమని అన్నారు. 20 వేల మంది కిడ్ని బాధితులను గుర్తిస్తే 400 మందికి మాత్రమే పింఛను అందుతోందని ఆయన చెప్పారు. కిడ్నీ బాదితులు తన గోడును చెప్పుకోవడానికి వైద్య శాఖకు మంత్రి లేరని, ఎంత మంది ముఖ్యమంత్రి వద్దకు వెళ్లగలుగుతారని అన్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోపంతో ప్రధాని మోడీ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవతో ప్రజలు శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, నిధులు దుర్వినియోగం కాకుండా తనిఖీలు చేయడానికి ఓ కమిటీ వేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధి కోసమని విదేశాలకు వెళ్తుంటారని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అంటూ పేదల జీవితాలు మరింత కిందికి దిగజారుతుంటే నేతల జీవితాలు పైకి వెళ్తుంటాయని ఆయన అన్నారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page