హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రా గవర్నర్ నరసింహన్‌ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం కలిశారు. తిత్లీ తుఫాన్ బాధితులను కేంద్రప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆదుకునేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. 

విశాఖపట్నంలో ఉండగా తిత్లీ తుఫాన్ బాధితుల  కష్టాలను వివరించేందుకు అపాయింట్మెంట్ అడిగానని మంగళవారం సాయంత్రం 4గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారని అందులో భాగంగా గవర్నర్ ను కలిసినట్లు పవన్ తెలిపారు.

తిత్లీ తుఫాన్ ధాటికి శ్రీకాకుళం జిల్లా సర్వనాశనం అయ్యిందని ఆ విషయాన్ని వీడియోలతో సహా ఏవీ ప్రజంటేషన్ ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. తిత్లీ తుఫాన్ ధాటికి ఉద్యానవనం లాంటి ఉద్దానం దారుణంగా నష్టపోయిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. తుఫాన్ కు ముందు ఉద్దానం ఎలా ఉంది తిత్లీ తర్వాత ఉద్దానం ఎలా ఉందో అన్న విషయాన్ని వీడియోల ద్వారా వివరించినట్లు తెలిపారు.
 
శ్రీకాకుళం జిల్లాలో ఆరు రోజులపాటు తాను పర్యటించానని 48 గ్రామాల్లో లక్ష మంది బాధితులతో మాట్లాడానని తెలిపారు. రోజుకు 30 కిలోమీటర్ల మేర పర్యటించానని దాదాపు రోజుకు 10 కిలోమీటర్లు వరకు కాలినడకన కూడా నడిచానని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోని గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ సహాయక చర్యలు జరగలేదని తెలిపారు. 

ఇతర రాజకీయ పార్టీలు లాగా తాము మాటలు చెప్పడానికి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించలేదని తుఫాన్ బాధితులను చూసి ఎంతో ఆవేదన కలిగిందన్నారు. శ్రీకాకుళం జిల్లా యధావిధికి రావాలంటే కనీసం 10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందన్నారు. 

తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి తాము గవర్నర్ ను కలవడానికి రాలేదన్నారు. ప్రజల సమస్యలు చూసి బాధేసిందని వారిని వెంటనే ఆదుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు గవర్నర్ ను కలిసినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పీఆర్ ఎక్సరసైజ్ చెయ్యడం కాదని వారికి సహాయం అందిస్తే బాగుండేదన్నారు.

కేరళలో జరిగిన ప్రకృతి విపత్తు ప్రపంచ దృష్టికి వెళ్లిందని కానీ తిత్లీ తుఫాన్ వల్ల ఉద్దానం సర్వ కోల్పోతే దేశం దృష్టికి తీసుకెళ్లలేదన్నారు. ప్రజలు సైతం తమను గ్రామాల్లోకి రావొద్దు అంటున్నారని పవన్ తెలిపారు.

 ప్రజలను ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఆదుకోవాలని వారికి ఓ భరోసా ఇవ్వాలని పవన్ కోరారు. గవర్నర్ తమ వినతిపై సానుకూలంగా స్పందించారని కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూస్తామని లేకపోతే కేంద్రాన్ని కూడా కలుస్తానన్నారు. 
 
మత్స్యకారులు తిత్లీ తుఫాన్ వల్ల సర్వం కోల్పోయారని వారిని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గవర్నర్ నరసింహన్ తాము సమర్పించిన నివేదికపై సానుకూలంగా స్పందించారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన పార్టీ ఇచ్చిన వినతిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని తెలిపారు.