ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయాన్ని  చవిచూసింది. కనీసం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. ఆ పార్టీ నుంచి ఒకే ఒక్క వ్యక్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా... ఓటమిపై గురువారం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసుకొని.. ఏ కారణాల వల్ల ఓటమిపాలయ్యామో తెలుసుకున్నారు.

కాగా...  ‘‘ప్రజల్లోకి వెళ్లేందుకు ఎక్కువ సమయం దొరకలేదు... ప్రచారాలకు కూడా పెద్దగా డబ్బులు లేవు... ఇతర పార్టీలు ప్రజలను డబ్బుతో ప్రలోభపెట్టాయి. ఇతర పార్టీలకు లాగా మనకు గ్రామాల్లో కమిటీలు లేవు. స్థానికంగా బలం లేదు. కేవలం అభిమాన బలంతో మాత్రమే ఎన్నికల్లోకి దిగాం. గెలవలేకపోయినా... ఓట్లు మాత్రం బాగానే పోలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి పట్టు సాధిస్తే.. విజయం కచ్చితంగా మన సొంతమౌతుంది’’ అని పార్టీ నేతలు పవన్ కి సూచించారు.

అనంతరం పవన్ మాట్లాడుతూ... ప్రభుత్వ వ్యతిరేక ఓటు మనకు పడలేదని.... జగన్ కే పడిందని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. ఆ కారణంతోనే జగన్ విజయం సాధించాడని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ నేతలు ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ పడి... పార్టీ బలాన్ని పెంచుకుందామని సూచించారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని భావించారు. 

 సుమారు నాలుగు గంటలపాటు  జరిగిన ఈ సమీక్షా సమావేశంలో..  ఏలూరు, నరసాపురం పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన నాగబాబు, పెంటపాటి పుల్లారావు సహా 14 మంది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమీక్షకు హాజరయ్యారు.