కుల వ్యవస్థ నిర్మూలన జనసేన ఆశయం. ప్రవైటు స్కూళ్లలో అన్ని కులాల విద్యార్థుల్ని ఒకచోట కూర్చోపెట్టగలిగినప్పుడు, ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు సాధ్యం కాదు? విద్యా వ్యవస్థ గురించి మాట్లాడటానికి ఒక రోజు, ఒక మీటింగ్ చాలదు.
ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేసి, కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావడమే తన ఆశయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఏలూరులో ప్రభుత్వ ఉపాధ్యాయులతో భేటీ అయ్యారు. వారితో పలు అంశాలపై పవన్ చర్చలు జరిపారు. ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..‘‘ ఉద్దేశపూర్వకంగా రద్దు చేసిన ప్రభుత్వ పాఠశాలల్ని పునరుద్దరిస్తాం. ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రైవేటు విద్యా సంస్థల్లో భాగస్వాములైతే, ప్రభుత్వ రంగ పాఠశాలల్ని ఎందుకు చంపాలి? జనసేన అధికారంలోకి రాగానే కుల, మతాలకు అతీతంగా కామన్ స్కూల్ వ్యవస్థని ఏర్పాటు చేస్తాం. చిన్న వయసులోనే కులాల్ని అలవాటు చేస్తే ఎలా..? కుల వ్యవస్థ నిర్మూలన జనసేన ఆశయం. ప్రవైటు స్కూళ్లలో అన్ని కులాల విద్యార్థుల్ని ఒకచోట కూర్చోపెట్టగలిగినప్పుడు, ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు సాధ్యం కాదు? విద్యా వ్యవస్థ గురించి మాట్లాడటానికి ఒక రోజు, ఒక మీటింగ్ చాలదు.’’
‘‘విద్యా వ్యవస్థపై నాకు చాలా బలమైన అవగాహన, ఆవేదన కూడా ఉన్నాయి. ప్రాథమిక విద్య ప్రైవేటీకరణ చాలా బాధ కలిగించే అంశం. విద్యా వ్యవస్థలో సర్వీస్ రూల్స్ అమలుపై అధ్యయనం చేస్తాం. మూడో తరగతి వరకు మహిళా టీచర్లతో విద్యా బోధన అనే అంశంపై మరింత చర్చ అవసరం. ప్రభుత్వ ఉపాధ్యాయుల శ్రమ దోచుకుంటున్న విషయం నా దృష్టికి వచ్చింది.’’
‘‘టీచర్లు బోధన చేయాలిగానీ, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోసం యాప్ లలో మరుగుదొడ్ల వివరాలు అప్ లోడ్ చేయడం ఏంటి..? ఒత్తిడిలో విద్యా బోధన ఎలా చేస్తారు? శ్రమ దోపిడికి జనసేన పార్టీ వ్యతిరేకం. జనసేన అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తాం. బలమైన విద్యా విధానానికి జనసేన ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది’’ అని పవన్ పేర్కొన్నారు.
