జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో వారాహి యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పెందుర్తి నియోజకవర్గంలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో వారాహి యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పెందుర్తి నియోజకవర్గంలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు.. వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వాలంటీర్లను ఇళ్లలోకి తీసుకొస్తున్నారని అన్నారు. ఇళ్లలోకి ఏ టైమ్ వస్తారో తెలియదని అన్నారు. దండుపాళ్యం బ్యాచ్‌కు, వాలంటీర్లకు తేడా లేదని విమర్శించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండటం చూసిన వాలంటీర్.. ఆమె మెడలో ఉన్న బంగారు తాడు కోసం హత్య చేశాడని అన్నారు. నమ్మకంగా లోనికి అనుమతిస్తే.. అతి కిరాతకంగా హత్య చేశాడని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని ఆమె కుటుంబం కూడా కోరుకుంటుందని అన్నారు. ఈ కేసులో వాలంటీర్ చేసిన దురాగతాన్ని బయటకు తీసుకొచ్చిన పోలీసు శాఖను అభినందిస్తున్నట్టుగా చెప్పారు.
వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఈ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాలేదని.. తద్వారా వారి ఆలోచన ఏమిటో అర్థం అవుతుందని అన్నారు. ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ.. వైసీపీ కార్యకర్తల కోసం సమాంతరంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు. వారు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. చిన్నపాటి ఉద్యోగం కావాలన్న, పాస్‌పోర్టు కావాలన్న పోలీసు వెరిఫికేషన్ చేస్తారని.. వాలంటీర్ల నియామకంలో మాత్రం ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ తీసుకోవడం లేదని అన్నారు. ఇదేమి విధానం అని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్దం అని విమర్శించారు. నవరత్నాల కోసం పెట్టుకున్న వ్యవస్థ ప్రజల ప్రాణాలు తీస్తే ఎలా ప్రశ్నించారు. తనకు ఆంక్షలు విధిస్తున్నారని.. వాలంటీర్లకు మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవని.. వారికి ఆంక్షలు విధిస్తే అరాచకాలు జరగవని అన్నారు.
ఏపీలో మహిళలు మిస్సింగ్ గురించి తాను బెచితే.. తనపై వైసీపీ నాయకులు విమర్శలు చేశారని మండిపడ్డారు. కేంద్ర హోం శాఖ కూడా పార్లమెంట్‌లో ఇదే విషయం చెప్పిందని అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి 151 చిన్న పిల్లలు అదృశ్యమయ్యారని.. ఏపీ నుంచి హ్యుమన్ ట్రాఫిక్ జరుగుతుందని నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యర్థి చెప్పారని అన్నారు. ఏపీలో శాంతిభద్రతలు బాగోలేవని విమర్శించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని తాము కోరుకుంటున్నామని తెలిపారు. పోలీసులను వారి పని వారిని చేయనిస్తే నేరాలు తగ్గుతాయని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులే నేరాలు చేస్తున్నారని.. పోలీసు శాఖ చేతులు కట్టేస్తున్నారని విమర్శించారు. వరలక్ష్మీ హత్య కేసులో నిందితుడికి శిక్ష పడేవరకు జనసేన వారి కుటుంబానికి న్యాయ సాయం చేస్తుందని చెప్పారు.
జనసేన అద్భుతాలు చేస్తుందని తాను చెప్పడం లేదని.. వ్యవస్థలను సక్రమంగా పనిచేయిస్తుందని మాత్రం చెప్పగలనని తెలిపారు. వ్యవస్థలను బలోపేతం చేయడం, శాంతిభద్రతలను కాపాడటం అనేది తమ అభిమతం అని చెప్పారు. విశాఖలో పరిస్థితులు ఘోరంగా తయారయ్యానని.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ జరిగిందని.. అలాంటిది వాళ్లనే ఎంపీ వెనకేసుకు రావడం ఏమిటని ప్రశ్నించారు. ఏపీలో శాంతిభద్రతల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
