లోకేషా! అంటూ నవ్వేసి పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు: బాబుపైనా...

లోకేషా! అంటూ నవ్వేసి పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు: బాబుపైనా...

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుమారుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నారా లోకేష్ గురించి కార్యకర్తలు, అభిమానులు అడిగినప్పుడు చెప్పాల్సిన విషయాన్ని నర్మగర్భంగా చెప్పేశారు. 

"లోకేషా.. (నవ్వుతూ) ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగారి అబ్బాయి. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా..? ప్రభుత్వం వాళ్ల చేతుల్లో ఉంది.. ఖజానా కూడా వాళ్ల చేతుల్లోనే ఉంది. తాళాలూ వారి చేతుల్లోనే ఉన్నాయి.. అంతా వాళ్లిష్టం వాళ్లేమైనా చేసుకోనీ!"  అని అన్నారు. 

అంతకు ముందు చంద్రబాబుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. రూ. 2వేల కోట్లకు పైగా పుష్కరాలకు ఖర్చు పెట్టారని, మంత్రివర్గ సభ్యులను విదేశాలకు తీసుకువెళ్లడానికి రూ. 25 లక్షలు ఖర్చయ్యేదానికి రూ. కోటిన్నర ఖర్చు చేశారని ఆరోపించారు. ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే.. ఉద్దానం కిడ్నీ బాధితులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అడిగారు.

ధర్మపోరాటం అంటే ఏమిటో తనకు అర్థం కాలేదని పవన్ చంద్రబాబునుద్దేశించి అన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళదాం...నేనోవైపు...మీరోవైపు కూర్చుందామని ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు.అవినీతిలో ఏపీని రెండో స్థానంలో నిలిపిన ఘనత చంద్రబాబుదినని అన్నారు. 

జనసేనకు సంస్థాగత నిర్మాణం లేదని విమర్శించడం టీడీపీకి చాలా తేలిక అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రస్తుతం ఉన్న టీడీపీ ఆయన స్థాపించింది కాదని, ఎన్టీఆర్ స్థాపించిందని అన్నారు.  చంద్రబాబుకున్నట్లు తనకు హెరిటేజ్‌లా సంస్థలు లేవని, కేవలం జన బలం మాత్రమే ఉందని అన్నారు. 

‘బై బై యే బంగారు రమణమ్మ..’ అనే పాటను ఆయన సభలో పాడి వినిపించారు.. శ్రీకాకుళం కళాకారులే తనకు ఈ పాటను నేర్పించారని పవన్ చెప్పారు. ఆ కళాకారులకు పవన్ హృదయపూర్వక నమస్సులు తెలిపారు.

ప్రస్తుత రాజకీయ నాయకుల్లా తాను ప్రజలను వంచించని, మోసం చేయబోనని ఆయన అన్నారు. తప్పైనా.. ఒప్పైనా.. అన్నీ ప్రజలకు చెప్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను గెలుస్తానో.. లేదో తెలియదు కానీ.. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని అన్నారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page