విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావును తమ పార్టీలోకి ఆహ్వానించేది లేదని, ఆయనపై తనకేమీ కోపం లేదని, ఆయన ఆలోచనా ధోరణి తమ పార్టీకి సరిపడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గంటా వంటి వ్యక్తులు పక్షుల్లా వచ్చి ఎగిరిపోతారని, అలాంటి పక్షులను నమ్మబోనని ఆయన అన్నారు. 


విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యకర్తలతో పవన్ కల్యామ్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. అవినీతిపరులైన వ్యక్తులు పార్టీలోకి వచ్చినావారు దోచుకున్నదంతా ప్రజలకు పంచిపెట్టి సంస్కారవంతులు కావాలని ఆకాంక్షిస్తానని అన్నారు. రాజకీయాలను లోకేశ్‌, జగన్‌ వంటి వారు వారసత్వపు హక్కుగా భావిస్తారని, తమ పార్టీ మాత్రం సామాజిక బాధ్యతగా పరిగణిస్తుందని ఆయన అన్నారు. 

2019లో పదునైన వ్యూహంతో ఏపీ అసెంబ్లీలోకి తమ పార్టీ అడుగు పెడుతుందని అన్నారు. నీతిపరులు, అవినీతిపరులు అని విడదీసుకుంటూ పోతే రాజకీయాలు చేయలేమని, రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఆ బురదలో దిగక తప్పదని అన్నారు.  తాను వెన్నుపోటు పొడిపించుకునేంత బలహీనుడిని కాదని ఆయన అన్నారు.