విజయవాడ: నివర్ తుఫాను బాధితులను పరామర్శించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో చేస్తున్న పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పామర్రు మండలం కనుమూరు వద్థ పవన్ కల్యాణ్ ర్యాలీ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. భారీ వాహనాలు పవన్ వాహనాన్ని అనుసరిస్తుండగా రెండు కార్ల మధ్య ఓ బైక్ ఇరుక్కుంది. దీంతో బైక్ పై వెళుతున్న జనసేన కార్యకర్త కాలు విరిగింది. తీవ్రంగా గాయపడ్డ యువకున్ని వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

నివర్ తుపాన్ మూలంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి... వారి కష్టాలను స్వయంగా తెలుసుకొనేందుకు పవన్ కల్యాణ్ నాలుగు రోజులపాటు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడుతున్నారు. ఇవాళ హైదరాబాద్ నుండి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన కృష్ణా జిల్లాలో నివర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.  

జిల్లాలోని ఉయ్యూరు నుండి ప్రారంభమైన యాత్ర పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాలమీదుగా సాగనుంది. ఆయా ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలిస్తున్నారు. అక్కడి రైతులను కలిసి వారి బాధలను తెలుసుకొంటున్నారు.

ఇక కృష్ణా జిల్లా పర్యటన అనంతరం పవన్ కల్యాణ్ పులిగడ్డ వంతెన మీదుగా గుంటూరు జిల్లాకు చేరుతారు. భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు, కొలకలూరుల్లో పర్యటిస్తారు. 

పవన్ కల్యాణ్ 3వ తేదీన తిరుపతి చేరుకొంటారు. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న నష్టాలపై జనసేన నాయకులతో చర్చిస్తారు. 4వ తేదీన శ్రీకాళహస్తి ప్రాంతంలో పర్యటించి అక్కడి రైతాంగాన్ని కలుస్తారు. అక్కడి నుంచి నాయుడుపేట, గూడూరుల్లో పర్యటించి నెల్లూరు చేరుకుంటారు. 5వ తేదీన నెల్లూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటిస్తారు.