ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవ్వడంతో పార్టీ నిర్మాణంపై సీరియస్‌గా దృష్టిపెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి వరుసగా సమీక్షలు చేయడంతో పాటు పలు కమిటీలను నియమిస్తూ వస్తున్నారు పవన్.

ఈ క్రమంలో తన కుటుంబసభ్యుడు.. సోదరుడు నాగబాబుకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని ఆయన భావిస్తున్నారు. సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి... దాని సారథ్య  బాధ్యతలను నాగబాబుకు కట్టబెట్టనున్నారు.

పార్టీలో నాయకులకు, శ్రేణులకు సమన్వయం లేదని పవన్ కల్యాణ్ గుర్తించారు. పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో తాను కేడర్‌తో కలిసేందుకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని ఆయన గ్రహించారు.

ఈ లోటును భర్తీ చేసేందుకే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం జనసేనలో పవన్ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న నేత మరొకరు లేరు. ఈ నేపథ్యంలో సమన్వయ కమిటీ బాధ్యతను నాగబాబుకు అప్పగిస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నారు.

అమెరికాలో జరిగే తానా సభల నుంచి భారత్ తిరిగొచ్చాక పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పవన్ పర్యటనలు చేయనున్నారు. ఈ పర్యటనలకు వెళ్లడానికి ముందే సమన్వయ కమిటీ బాధ్యతలను నాగబాబుకు అప్పగించాలని పవన్ భావిస్తున్నారు.

అన్నయ్య చిరంజీవికి తలలో నాలుకలో ఉంటూ వచ్చిన నాగబాబు.. ప్రజారాజ్యం స్థాపనలో కీలకపాత్ర పోషించారు. పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ... కేడర్‌కు ఆయన చాలా సన్నిహితంగా మెలిగేవారు.

వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు కిందిస్థాయి నేతలతో తరచుగా సమావేశాలు ఏర్పాటు చేసేవారు. పార్టీ ఎక్కడ బలహీనంగా ఉందో... అక్కడ ఎలాంటి నాయకులు ఉంటే మంచిదో ఎప్పటికప్పుడు చిరంజీవికి నివేదించేవారు. ఆ అనుభవం జనసేనకు సైతం ఉపయోగపడుతుందని జనసేనాని భావిస్తున్నారు.