చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టమోటా రైతులతో మాట్లాడతానంటే అనుమతి ఇవ్వరా అంటూ మండిపడ్డారు. అనుమతి ఇవ్వకపోయినా తాను వెళ్లి మార్కెట్ యార్డుకు వెళ్లి తీరతానని చెప్పుకొచ్చారు. తనను ఏ వైసీపీ నాయకుడు వచ్చి అడ్డుకుంటారో చూస్తానంటూ సవాల్ విసిరారు. 

ఒకవైపు ఉల్లిధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో మరోవైపు టమోటా ధరలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. సామాన్యుడికి నిత్యావసర వస్తువులు కూడా అందించకపోతే ప్రభుత్వాలు ఎందుకు అని నిలదీశారు. 

తాను రైతు సమస్యలపై మాట్లాడదామంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. అనుమతి ఇవ్వకపోతే భయపడే వ్యక్తిని కాదని చెప్పుకొచ్చారు. గురువారం జనసైనికులతో కలిసి మార్కెట్ యార్డుకు వెళ్తామని ధీమా వ్యక్తం చేశరాు. 
 
జనసైనికులు అంతా మార్కెట్ యార్డుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఏ వైసీపీ నాయకుడు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు. రోడ్డమీదనైనా సరే కూర్చుని నిరసన తెలుపుతానని చెప్పుకొచ్చారు.  

రాయలసీమలో తన పర్యటనను అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తన పర్యటనను ఎవరూ అడ్డుకోలేరన్నారు. రాయలసీమ ఎంతో గొప్పదని చెప్పుకొచ్చారు. అలాంటి రాయలసీమను ఫ్యాక్షన్ సీమగా మార్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

తనకు తెలుగు భాష అన్నా, తెలుగ మాండలికాలన్నా ఎంతో గౌరవం అని చెప్పుకొచ్చారు. అలాంటి తెలుగు భాషకు అన్యాయం జరిగితే తాను తట్టుకోలేనని తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిఇంగ్లీష్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. మార్కెట్ యార్డు సందర్శనకు ఎవడి అనుమతులు కావాలని నిలదీశారు. మీ బోడి పర్మిషన్లుతనకు అక్కర్లేదన్నారు. మదనపల్లి మార్కెట్ యార్డు పర్యటనను ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్నారు.  

తాము భయపడటానికి మేకలం కాదని సింహాలమని చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులు తనను ఎంత ఆపితే అంత దూసుకు వెళ్తానని స్పష్టం చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ తనకు రెండు చిటికెలంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. 

ఇకపోతే పవన్ కళ్యాణ్ గురువారం మదనపల్లిలోని మార్కెట్ యార్డులో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుమతులు కోరారు. అయితే మార్కెట్ యార్డ్ కమిటీ కార్యదర్శి అందుకు అనుమతి ఇవ్వలేదు. టమోటా సీజన్ మెుదలైన నేపథ్యంలో పవన్ పర్యటన ఇబ్బంది కలిగిస్తుందని ఆరోపిస్తూ అనుమతి నిరాకరించారు. 

పవన్ కళ్యాణ్ మార్కెట్ యార్డ్ విజిట్ ను మార్కెట్ కమిటీ కార్యదర్శి వ్యతిరేకించడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తాము మార్కెట్ యార్డును సందర్శించి తీరుతామని రైతులతో మాట్లాడతామని తెలిపారు. ధర్నా చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోందది. 

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. మార్కెట్ యార్డు సందర్శనకు ఎవడి అనుమతులు కావాలని నిలదీశారు. మీ బోడి పర్మిషన్లుతనకు అక్కర్లేదన్నారు. 

మదనపల్లి మార్కెట్ యార్డు పర్యటనను ఎవరు అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు జనసేనాని పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.