అమరావతి: వేలం జాబితా నుంచి పీవీకె నాయుడు మార్కెట్ ను మినహాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. 

గుంటూరు ల్యాండ్ మార్క్ గా నిలిచిన పివీకె నాయుడు మార్కెట్ ను ప్రజా ఆస్తుల వేలం జాబితా నుంచి తప్పించేందుకు చేసిన పోరాటం ఫలితం ఇవ్వడం సంతోషదాయకమని ఆయన అన్నారు. దశాబ్దాలుగా ఉన్న మార్కెట్ ను వేలంలో విక్రయిస్తారని అనగడానే గుంటూరు ప్రజల్లో ఆందోళన చోటు చేసుకుందని పవన్ కల్యాణ్ చెప్పారు. 

తమ పార్టీ ప్రజల పక్షాన నిలిచి పది రోజుల పాటు దీక్షలు చేసి ఈ మార్కెట్ ను కాపాడేందుకు పోరాటం చేసిందని చెప్పారు. ఈ మార్కెట్ ను వేలం నుంచి కాపాడేందుకు పోరాడిన పార్టీ శ్రేణులను పవన్ కల్యాణ్ అభినందించారు. మిషన్ ఏపీ బిల్డ్ పేరుతో విలువైన ప్రజా ఆస్తులను అమ్మడం అంటే పాలనాపరంగా ప్రణాళిక లేకపోవడమేనని ఆయన అన్నారు. 

గుంటూరు మార్కెట్ విషయంలో ప్రజాభిప్రయానికి అనుగుణంగా ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారో అదే విధంగా ఇతర ప్రజా ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సంపద సృష్టి కోసం ఉన్న ఆస్తులు అమ్ముకోవడం సరి కాదని ఆయన చెప్పారు. 

ఆస్తులు విక్రయించి ఆదాయం పెంచామంటే ప్రజలు హర్షించబోరని ఆయన అన్నారు. పెట్టుబడులు వచ్చే మార్గాలు అన్వేషించకుండా ఆస్తులు విక్రయిస్తే ప్రయోజనం ఉండదని పవన్ కల్యాణ్ అన్నారు.