విజయవాడ: ఏపీలో పొత్తుల పేరుతో జరుగుతున్న రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసేన పార్టీ వామపక్షాలను కలుపుకుని పోటీ చేస్తుందని తాను చెప్తున్నా జనసేన పార్టీకి పొత్తులు అంటగట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని పవన్ ఆరోపించారు. 

విజయవాడలో కార్యకర్తల సమావేశంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నానని బీజేపీ, వైసీపీలతో పొత్తు పెట్టుకున్నానని టీడీపీ ఆరోపిస్తుందని మండిపడ్డారు. ఇటీవలే కేసీఆర్ ను రాజ్ భవన్ లో కలిస్తే కేసీఆర్ తో కలిసివెళ్తున్నానని ఆయన డైరెక్షన్లో నడుస్తున్నానని అదే టీడీపీ ఆరోపిస్తుందని చెప్పుకొచ్చారు. 

 

రాబోయే ఎన్నికల్లో జనసేన, వైసీపీ, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయంటూ ప్రచారం చెయ్యడాన్ని తప్పుబట్టారు. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమపై ఆరోపణలు చేస్తోందని జనసేన టీడీపీల మధ్య పొత్తు ఇంకా కొనసాగతుందని చెప్తోందని ఇది సరికాదన్నారు. 

నిజాయితీగా నీతిగా పోటీ చెయ్యాలనుకుంటున్న తమకు ఇలాంటి ప్రచారాలు ఇబ్బందికరంగా మారాయన్నారు పవన్ కళ్యాణ్. నిజాయితీగా పోటీ చెయ్యాలనుకున్నప్పుడు ఇలాంటివి ఎన్నోఫేస్ చెయ్యాల్సి ఉంటుందని కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్  సూచించారు.