విజయవాడ: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మరోసారి నిప్పులు చెరిగారు. చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. విజయవాడలో పశ్చిమగోదావరి జిల్లా నేతల సమావేశంలో చింతమనేని ఆగడాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు దళిత నేతలు.

 చింతమనేని దళితులను ఇబ్బంది పెడుతున్నారని పవన్ ఎదుట వాపోయారు. చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చింతమనేనిపై ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యడం లేదని ప్రశ్నించారు. 

టీడీపీ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని పవన్ వ్యాఖ్యానించారు. జనసేన సమాజం కోసమే పనిచేస్తుంది తప్ప కులం పేరుతో ప్రజలను విడగొట్టడానికి పనిచెయ్యదన్నారు. రాత్రికి రాత్రే పార్టీ నిర్మాణం సాధ్యం కాదని, త్వరలో పార్లమెంట్ స్థాయిలో కమిటీలు వెయ్యనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం కోసం ఎవరితోనైనా గొడవపెట్టుకుంటానని పవన్ వార్నింగ్ ఇచ్చారు. 

ఇకపోతే పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్రలో చింతమనేనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గాలి రౌడీలు, ఆకు రౌడీలకు భయపడే వ్యక్తిని కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఒక సైగ చేస్తే కాళ్ళు విరగ్గొట్టి కూర్చోబెడతారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

16 ఏళ్ల వయసులోనే ఆకు రౌడీలు, గాలి రౌడీలను తన్ని తరిమేశానని చెప్పుకొచ్చారు. ఖబడ్దార్ చింతమనేని అంటూ హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తులను వెనుకేసుకొస్తున్న టీడీపీకి తానెందుకు అండగా నిలవాలని ప్రశ్నించారు. ప్రభాకర్ లాంటి వ్యక్తి సింగపూర్‌లో ఉంటే కర్రతో కొడతారని, సౌదీ అరేబియాలో అయితే తల తీసేస్తారని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.