Asianet News TeluguAsianet News Telugu

పొత్తుకు బీటలు: బిజెపితో పవన్ కల్యాణ్ దోస్తీ కటీఫ్?

బిజెపి, జనసేనల మధ్య దోస్తీకి బీటలు వారినట్లు అర్థమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని పక్కన పెట్టి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణికి పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. దీన్ని బట్టి పవన్ కల్యాణ్ బిజెపికి దూరం జరగాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది.

Pawan Kalyan differs with BJP and supports TRS candiadate Surabhi Vani
Author
Hyderabad, First Published Mar 15, 2021, 7:34 AM IST

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు ధర్మాన్ని విస్మరించినట్లు కనిపిస్తున్నారు. తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణికి మద్దతు పలికారు. బిజెపి అభ్యర్థి రామచంద్రరావు బరిలో ఉన్నప్పటికీ ఆయన ఆ పనిచేశారు. పైగా, ఓటింగ్ జరుగుతున్న రోజున ఆయన వాణికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో బిజెపితో ఆయన దూరం జరిగేందుకు సిద్ధపడినట్లు భావిస్తున్నారు.

ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా పవన్ కల్యాణ్ వాణికి మద్దతు పలుకుతూ ప్రకటన చేశారు. అలా చేయకూడదని పవన్ కల్యాణ్ కు తెలియందేమీ కాదు. సురభివాణికి మద్దతు పలికినందుకు ఆయన ఈసీ నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. అంటే, బిజెపితో పొత్తుపై పవన్ కల్యాణ్ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారనేది అర్థమవుతోందని, అందువల్లనే ఆలా చేయకూడదని తెలిసినా సురభి వాణికి మద్దతు తెలిపారని అంటున్నారు. 

సురభి వాణికి మద్దతు తెలుపుతూ పవన్ కల్యాణ్ హైదరాబాదులో ప్రకటన చేయగా, విజయవాడలో జనసేన ప్రధాన కార్యదర్శి పోతిన మహేష్ బిజెపిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో బిజెపి వల్లనే ఓటమి పాలయ్యామని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ బిజెపితో దోస్తీపై స్పష్టత ఇవ్వడం వల్లనే పోతిన మహేష్ ఆ ప్రకటన చేశారని భావిస్తున్నారు. పోతిన మహేష్ ప్రకటనను బట్టి కూడా జనసేన బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడినట్లు భావిస్తున్నారు. 

పవన్ కల్యాణ్ బిజెపిపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు బిజెపి రాష్ట్ర నాయకత్వం తనను వాడుకుని వదిలేసిందని జనసేన నాయకులు తన దృష్టికి తెచ్చారని, గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అలాంటివారితో మీరు ఇంకా స్నేహం చేయాలని చెప్పే ధైర్యం తనకు లేదని ఆయన ఆయన అన్నారు.

పవన్ కల్యాణ్ ఆ ప్రకటన చేసిన కొద్దిసేపటికే పోతిన మహేష్ ఓ వీడియో విడుదల చేశారు. బిజెపి విధానాల వల్లనే విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో జనసేన ఓడిపోయిందని ఆయన ఆరోపించారు. బిజెపి విధానాలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. బిజెపిపై పోతిన మహేష్ ప్రకటనను బట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంతర్యం ఏమిటో అర్థమవుతోందని అంటున్నారు.

ప్రతిసారీ పవన్ కల్యాణ్ బిజెపితో పొత్తు వల్ల ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తిరుపతి లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలని గట్టి పట్టుదలతో ఉంటూ వచ్చారు. చివరకు ఆ సీటును బిజెపికి వదులుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో కూడా పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల విషయంలో జరిగిన పరిణామాల పట్ల కూడా ఆయన ఆవేదనతో ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా, బిజెపితో తెగదెంపులు చేసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి పవన్ కల్యాణ్ వచ్చినట్లు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios