హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్నికల్లో నిలబడే ధైర్యం లేక పంచాయితీ ఎన్నికలను వాయిదా వేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇకనైనా హైకోర్టు ఆదేశాలను గౌరవించి పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని పవన్ కోరారు. స్థానిక సంస్థల అధికారాలను నిలబెట్టేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం హర్షించదగ్గ పరిణామమని పవన్ అభిప్రాయపడ్డారు. 

కాలపరిమితి ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలన తీసుకురావడం సరైన విధానం కాదన్నారు. పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే జీవో నెం.90ను తెరపైకి తీసుకువచ్చిందని తెలిపారు. ప్రజలచే ఎన్నికయ్యే ప్రతినిధులు లేకపోతే స్థానిక సమస్యలు ఏవిధంగా పరిష్కారం అవుతాయి, ప్రజలు తమకు ఎదురయ్యే ఇబ్బందులపై ఎవరికి చెప్పుకుంటారు అని పవన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 

ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధికోసమే జీవో నెం.90ను తీసుకువచ్చిందన్నారు. ఇలాంటి ఉత్తర్వులు పంచాయితీరాజ్ చట్టాన్ని నవ్వులపాల్జేస్తాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. హైకోర్టు చెప్పిన విధంగా మూడు నెలల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని పవన్ హితవు పలికారు.