వైసీపీకి కాదు..ప్రజలకు విధేయులుగా పని చేయండి : వైసీపీ సర్కారుపై పవన్ కళ్యాణ్ ఫైర్
Machilipatnam: వైసీపీకి కాదు..ప్రజలకు విధేయులుగా పని చేయండి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారులకు హితవుపలికారు. 'రాజ్యాంగం కల్పించిన విధివిధానాల ప్రకారం అధికారులు పని చేయాలి. సహజ వనరుల రక్షణ బాధ్యత వారిదేనని' స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అధికార వైసీపీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. సహజ వనరులను వైసీపీ నాయకులు ఇష్టానుసారం దోచేస్తున్నారని ఆరోపించారు.
Machilipatnam: వైసీపీకి కాదు..ప్రజలకు విధేయులుగా పని చేయండి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారులకు హితవుపలికారు. 'రాజ్యాంగం కల్పించిన విధివిధానాల ప్రకారం అధికారులు పని చేయాలి. సహజ వనరుల రక్షణ బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అధికార వైసీపీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. సహజ వనరులను వైసీపీ నాయకులు ఇష్టానుసారం దోచేస్తున్నారని ఆరోపించారు.
వివరాల్లోకెళ్తే.. మచిలీపట్నం జనవాణి- జనసేన భరోసా కార్యక్రమంలో ప్రజల సమస్యలు అవగతం చేసుకున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్.. ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహజ వనరులను వైసీపీ నాయకులు ఇష్టానుసారం దోచేస్తున్నారనీ, వారు చెప్పినట్లు ఐఏఎస్, రెవెన్యూ అధికారులు నడుచుకుంటున్నారని విమర్శించారు. ప్రజల కోసం, చట్టాల పరిరక్షణ కోసం పని చేయాల్సిన అధికారులు వైసీపీ నాయకుల కనుసన్నల్లో పని చేయడం సరికాదన్నారు. ''ప్రతి అధికారి విధులకు సంబంధించి రాజ్యాంగంలో చెప్పిన విధంగా విధివిధానాలు ఉన్నాయి. వాటిని అనుసరించి పని చేయాలి తప్పితే ఏ పార్టీకో, నాయకుడో చెప్పినట్లు పని చేయడం సరికాదని'' పవన్ పేర్కొన్నారు. జనవాణి-జనసేన భరోసాలో ప్రతి సమస్యపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తూ బాధితుల ఆవేదనను మనసుతో విని స్పందించారు. వచ్చిన ప్రతి సమస్యను పరిశీలించి రాబోయే జనసేన, తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో దానిని పరిష్కరించే విధానాన్ని వివరించారు. వైసీపీ నాయకుడు మాదిరి నోటికి వచ్చిన హామీ ఇవ్వడం కాకుండా ప్రతి సమస్యపైన సమగ్ర అధ్యయనం చేసి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
విశాఖ ఎర్రమట్టి దిబ్బలు మాదిరి మచిలీపట్నం తీర ప్రాంతాల్లో ఇసుక దిబ్బలు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయనీ, ఈ ఇసుక దిబ్బలను స్థానిక వైసీపీ నాయకులు అడ్డగోలుగా దోచేస్తున్నారని ఆరోపించారు. తుపాన్లు, సముద్ర అటుపోట్లుకు రక్షణ వలయంగా నిలుస్తున్న ఇసుక దిబ్బలను ఇష్టానుసారం దోచేయడం వల్ల ఉప్పు నీరు పొలాల్లోకి ప్రవేశించి పంటలు తీవ్రంగా నష్టపోతున్నామని తీర ప్రాంత రైతాంగం తమ దృష్టికి తీసుకువచ్చిందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు ఈ సమస్య విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. సహజ వనరులు దోచుకోకుండా బలమైన చట్టాలు తీసుకురావాలనీ, అలాగే అధికారులు బాధ్యతగా వ్యవహరించి సహజవనరుల దోపిడీని ఆరికట్టాలన్నారు. ''రాష్ట్రంలోని 1.95 కోట్ల ఇళ్లకు విద్యుత్ మీటర్లు చెక్ చేసి బిల్లులు ఇచ్చే బిల్ రీడర్స్ కడుపు కొట్టాలని ప్రభుత్వం చూస్తోంది. 4 వేల కుటుంబాలకు సంబంధించిన సమస్య ఇది. రీడర్స్ కు ప్రత్యామ్నాయం చూపకుండా వారి పని దినాలు తగ్గించి, వారి కుటుంబాలను రోడ్డున పడేలా చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పే క్లాస్ వార్ ఉద్దేశం నాకు తెలియదు కానీ.. క్లాస్ వార్ చేస్తూ పేద, మధ్య తరగతి బతుకులను వైసీపీ ప్రభుత్వం చిధ్రం చేస్తోంద''న్నారు.
పేదల పక్షాల నిలబడకుండా, రూ.7 వేల కోట్లు ఎవరికో మీటర్ల కాంట్రాక్టు ఇచ్చేసి వీరిని రోడ్డున పడేసే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండును జనసేన పరిగణలోకి తీసుకుంటుందన్నారు. జనసేన ప్రభుత్వం రాగానే టీడీపీతో ఈ అంశంపై చర్చించి మీకు న్యాయం జరిగేలా పోరాడుతామని తెలిపారు. సర్వశిక్ష అభియన్ లో పదేళ్లుగా పీఈటీలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయిందని విమర్శించారు. ఆ హామీ అమలు కాకపోగా 3 నెలలు నుంచి వారికి జీతాలు ఆపేయడం దుర్మార్గమనీ, ధర్నాలు చేస్తే ఉద్యోగాలు ఊడుతాయని బెదిరించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. కేంద్రం అందించే పథకాలు రాష్ట్రం దగ్గరకు వచ్చే సరికి నిర్వీర్యం అవుతున్నాయనీ, జగన్ పాదయాత్ర సమయంలో నోటికి ఏది వస్తే ఆ హామీ ఇచ్చారన్నారు. పంచాయతీలకు సంబంధించిన ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దొంగిలించిందని ఆరోపించారు.