వచ్చే ఎన్నికల్లో  పోటీ చేసేందుకు బలమైన  అభ్యర్థుల ఎంపిక కోసం జనసేన  సర్వేలు నిర్వహిస్తోంది. ఢిల్లీకి చెందిన  దేవ్ అనే సంస్థ, హైద్రాబాద్‌కు చెందిన  రెండు యూనివర్శిటీల సిబ్బందితో సర్వేలు నిర్వహిస్తున్నారు

విజయవాడ: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం జనసేన సర్వేలు నిర్వహిస్తోంది. ఢిల్లీకి చెందిన దేవ్ అనే సంస్థ, హైద్రాబాద్‌కు చెందిన రెండు యూనివర్శిటీల సిబ్బందితో సర్వేలు నిర్వహిస్తున్నారు.ఈ సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు టిక్కెట్లను కేటాయించనున్నారు.

2019 ఎన్నికలను జనసేన చాలా సీరియస్‌గా తీసుకొంది. సీపీఎం, సీపీఐలతో కలిసి జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది. అయితే ఈ మూడు పార్టీల మధ్య ఇంకా పొత్తుల చర్చలు పూర్తి కాలేదు. ఏ స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

అయితే ఈ లోపుగానే తమ పార్టీ తరపున బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని జనసేన భావిస్తోంది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ, ఏ అభ్యర్థి బలబలాలు ఏమిటనే విషయమై సర్వే నిర్వహిస్తున్నారు.

ఈ సర్వే ఆధారంగా టిక్కెట్లను కేటాయించాలని జనసేన భావిస్తోంది. ఇతర పార్టీల్లో టిక్కెట్లు దక్కవనే అనుమానంతో ఉన్న నేతలు కొందరు జనసేనతో టచ్‌లోకి వస్తున్నారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు సీనియర్లు కూడ జనసేనలో చేరే విషయంలో మల్లాగుల్లాలు పడుతున్నారని సమాచారం.

ఇతర పార్టీల్లో టిక్కెట్లు దక్కక జనసేనవైపు చూస్తున్న సీనియర్లకు జనసేనలో ప్రాధాన్యత దక్కే అవకాశం లేకపోలేదు. పొత్తులో భాగంగా విజయవాడ సెంట్రల్‌ సీపీఎం, పశ్చిమ నియోజకవర్గం సీపీఐ అడగాలనే ఆలోచనతో ఉన్నాయి. ఇవి కాక ఆ రెండు పార్టీలు జిల్లాలో మరికొన్ని సీట్లు కోరే అవకాశం ఉంది. సెంట్రల్‌ నుంచి సీపీఎం తరఫున గతంలో పోటీ చేసిన బాబూరావు బరిలోకి దిగే అవకాశం ఉంది. పశ్చిమ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పోటీ చేయవచ్చునని చెబుతున్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ రెండవ కుమార్తె విజయవాడ లేదా మచిలీపట్నం పార్లమెంటు సీటుపై పట్టుబడుతున్నట్టు ప్రచారం సాగుతోంది. పవన్‌ కల్యాణ్‌కు సన్నిహితుడు తోట చంద్రశేఖర్‌ భార్య అనురాధ అవనిగడ్డ ప్రాంతానికి చెందినవారు కావడంతో అవనిగడ్డ అసెంబ్లీ లేదా మచిలీపట్నం పార్లమెంటు నుంచి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు పార్టీ వర్గా లు తెలిపాయి.