ఏపీ ఎన్నికల్లో ఓటమిపై  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ పార్టీ అభ్యర్థులతో సమీక్ష నిర్వహించిన పవన్ తాజాగా... శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా నేతలతో సమీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఎన్నికలు పద్ధతిగా జరగలేదన్నారు. పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని చెప్పారు. ఇతర పార్టీల నేతలు డబ్బులు మంచినీటి ప్రాయంలా ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. ఒక్కో నియోజకవర్గానికి కొందరు నేతలు రూ.150కోట్లు ఖర్చు పెట్టారని ఆయన అన్నారు. తమ పార్టీ నేతలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని.. అయినా.. లక్షల్లో ఓట్లు తమకు పడ్డాయని పవన్ చెప్పారు.

జనసేన నాలుగేళ్ల క్రితం పోటీ చేసినట్లయితే ఇంకా బలం పెరిగేదని అభిప్రాయపడ్డారు. మహిళలు, యువతీ, యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని, అందుకే ఇన్ని లక్షల ఓట్లు వచ్చాయిని తెలిపారు. సమీక్షలు పూర్తి చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక అవగాహనకు వస్తామని పవన్‌ స్పష్టం చేశారు.