Asianet News TeluguAsianet News Telugu

జైలుకు వెళ్లి వచ్చినవారే....: జగన్ పై పవన్ కల్యాణ్ వ్యాఖ్య

జైలుకు వెళ్లివచ్చినవారే బయటకు వచ్చి ఇబ్బంది పడనప్పుడు తానెందుకు ఇబ్బంది పడాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ వ్యాఖ్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసినట్లుగా భావిస్తున్నారు.

Pawan Kalyan comments on YS Jagan at TANA conference
Author
Washington D.C., First Published Jul 6, 2019, 11:46 AM IST

వాషింగ్టన్ డీసీ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రవాసాంధ్రులకు చెందిన తానా సదస్సులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆయన తానా సదస్సులో సుదీర్ఘంగా మాట్లాడారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి గల కారణాలను వివరించారు. ఓటమి నుంచి కోలుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాలు మాత్రమే పట్టిందని, ఓటమి చెందిననందుకు తానేమీ తప్పు చేయలేదని ఆయన అన్నారు. 

జైలుకు వెళ్లివచ్చినవారే బయటకు వచ్చి ఇబ్బంది పడనప్పుడు తానెందుకు ఇబ్బంది పడాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ వ్యాఖ్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసినట్లుగా భావిస్తున్నారు. తాను రాజకీయ ప్రసంగమో, సినిమా ప్రసంగమో చేయడానికి ఇక్కడికి రాలేదని ఆయన చెప్పారు. వస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి వచ్చానని ఆయన అన్నారు. మీకు చెప్పడానికి, మీతో పంచుకోవడానికి తన వద్ద ఏమీ లేదని ఆయన అన్నారు. తనకు ఏ కోరికా లేదని, నటుడిని అనే భావన కూడా తనకు లేదని, ఏదో సాధించాలనే కోరిక కూడా లేదని ఆయన అన్నారు. 

తన ఓటమి గురించి ఇప్పటి వరకు తాను ఎక్కడా మాట్లాలేదని, తొలిసారి మనస్ఫూర్తిగా మాట్లాడాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. బల్బును కనిపెట్టిన శాస్త్రవేత్తకు తన తల్లి దండం పెట్టేదని, ప్రతి అపజాయనికి విజయానికి దారి వేస్తుందని ఆ శాస్త్రవేత్త బల్బును కనిపెట్టిన విధానం ద్వారా తాను తెలుసుకున్నానని ఆయన అన్నారు. చాలా ఆలోచించే తాను జనసేన పార్టీని పెట్టానని ఆయన అన్నారు.

సినిమాల్లో ఇంకా తన కెరీర్ ఉందని, దేశ సమగ్రత విచ్ఛిన్నవుతుందనే భయంతో దాన్ని కాపాడాలని తాను పార్టీ పెట్టానని ఆయన అన్నారు. మనందరిలో ఐక్యత లేదని, విడిపోతున్నామని, ఏదో ఒక రోజు దేశ సమగ్రత భంగం వాటిల్లుతుందనే భయం ఉండేదని, దేశసమగ్రత కోసం రాజకీయ నాయకులు ధైర్యంగా మాట్లాడడం లేదని, దాంతో దేశంపై ప్రేమతో సమగ్రతను కాపాడడానికి జనసేనను పెట్టానని ఆయన అన్నారు. ఎవరో ఒకరు వచ్చి సత్యం మాట్లాడకపోతే తప్పు చేసినవాళ్లమవుతామని అనుకున్నానని, సినిమాల్లో గంటలకు గంటలు డైలాగులు చెప్పడం వేరు, సవాళ్లు చేయడం వేరు అనే విషయం తనకు తెలుసునని, నిజ జీవితంలో బయటకు వచ్చి మాట్లాడాలంటే ధైర్యం కావాలని, ఆ ధైర్యం మీరిచ్చిందేనని ఆయన అన్నారు. భయపడుతుంటే ముందుకు వెళ్లలేమని ఆయన అన్నారు.  

ఓటమి నుంచి కోలుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాల సమయం సరిపోయిందని, అపజయాన్ని అంగీకరించానని, వైఫల్యాలు తనకు గొప్ప పాఠాలు నేర్పాయని, ఓటమికి చాలా కారణాలు చెప్పవచ్చునని, కానీ తాను అలా చెప్పదలుచుకోలేదని అన్నారు. జీవితంలో ప్రతీ ఓటమి తనకు విజయానికి దగ్గర చేసిందని చెప్పారు. తాను ద్రోహాలు, కుంభకోణాలు చేసి రాజకీయాల్లోకి రాలేదని, విలువల కోసం వచ్చానని, అలాంటప్పుడు అపజయాన్ని తాను సంతోషంగా స్వీకరిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios