అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంగళవారం వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ప్రజలను మరోసారి ఆకర్షించడానికి రూపొందించారు తప్ప ప్రజల అభివృద్ధిని ఏ మాత్రం దృష్టిలో పెట్టుకోలేదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ ద్వారా  కనికట్టు చేశారని అన్నారు. 

''రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆదాయాన్ని పెంచడానికి చిన్న ప్రయత్నం కూడా  జరగలేదు. ఈ బడ్జెట్లో ఆర్ధిక వాస్తవికత, స్పష్టత లోపించింది. రాష్ట్ర ప్రగతిని విస్మరించని సంక్షేమ కార్యక్రమాలే ప్రజలకు మేలు చేస్తాయన్న వాస్తవ దృక్పథాన్ని బడ్జెట్ రూపకర్తలు విస్మరించారు. అభివృద్ధి లేని సంక్షేమం నీటి బుడగలాంటిది. అవి ప్రజలకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి'' అని అన్నారు. 

''రాష్ట్రానికి ఆదాయ మార్గాలను పెంచకుండా ఎంతో కాలం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించలేరు. గత ఆర్థిక సంవత్సరం (2019-20 ) బడ్జెట్ ను రూ. 2.27 లక్షల కోట్ల అంచనాలతో రూపొందించారు. కానీ సవరించిన అంచనాలతో ఆ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసినది రూ.1.74 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. వాస్తవ బడ్జెట్ అంచనాలకు సవరణలకు తేడా రూ.53,217.54 కోట్ల రూపాయలు'' వుందని వెల్లడించారు. 

read more   ఏపీ బడ్జెట్ 2020: పోలీసులకు ఇన్సూరెన్స్ రూ. 20 లక్షలకు పెంపు

''కీలకమైన వ్యవసాయం, ఇరిగేషన్, గృహనిర్మాణాల, వైద్య ఆరోగ్యం లాంటి శాఖల బడ్జెట్ కు కోతలు విధించారు.  దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 2020-21 ఆర్థిక సంవత్సరంలోను అంచనాలు భారీగా చూపారు తప్ప ఆచరణ ప్రణాళికలు కనిపించలేదు'' అని అన్నారు. 

కొత్త బడ్జెట్ చూసిన తరువాత జనసేన నేతలు, పార్టీకి సేవలు అందిస్తున్న మేధావులు కొన్ని సందేహాలను వ్యక్తం చేశారని పవన్ కల్యాణ్ అన్నారు. 
ఆ సందేహాలివే....
1) రాష్ట్రానికి కొత్తగా ఎంత మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి?

2) ఆంధ్రప్రదేశ్ లోని యువకుల కోసం ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు?

3) స్పష్టమైన నూతన పారిశ్రామిక విధానాన్ని ఎందుకు ప్రకటించడం లేదు. పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం ఎందుకు చేయడం లేదు? పారిశ్రామికవేత్తల విశ్వాసాన్ని చూరగొనడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏమిటి?

4) కష్టాలలోఉన్న రైతులను ఆదుకోడానికి ప్రభుత్వం ఎందుకు చొరవచూపడం లేదు? గిట్టుబాటు ధరలు లేక రైతులుపెడుతున్న కన్నీరు మీ కంటికి కనిపించడం లేదా? పొరుగు రాష్ట్రాలలో మాదిరిగా పంటను ప్రభుత్వమే నేరుగా కొనడానికి ఎందుకు చొరవ చూపడం లేదు? కరోనా కుంగదీస్తున్న సమయంలో ధరల స్థిరీకరణకు ప్రభుత్వం ఏ మేరకు నిధులు వెచ్చించింది? గడచిన ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి రూ.18,327 కోట్లు మేర ప్రతిపాదనలు చేసి ఎందుకు రూ.5,986 కోట్లకు తగ్గించారు? ఈ బడ్జెట్లో 35శాతం మేరకు ఎందుకు నిధుల ప్రతిపాదనలు తగ్గించారు?

5) రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కారణంగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాము అని చెప్పిన మీరు బడ్జెట్లో మాత్రం రాష్ట్రం ఆర్ధికంగా పురోగమిస్తోందని గారడీ మాటలు ఎందుకు చెబుతున్నారు?

6) నవరత్నాలను వల్లె వేస్తూ అభివృద్ధిని మరిచిపోయిన మీరు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు?

7) గ్రామ వాలంటీర్ల నియామకం ద్వారా రెండు లక్షల ఉద్యోగాలను సృష్టించామని చెబుతున్న ఆర్ధిక మంత్రి గారు.. గ్రామ వాలంటీర్లందరూ ప్రభుత్వ ఉద్యోగులే అని ప్రకటించగలరా?

8) కోవిడ్-19 ఉందని చెప్పి పట్టుమని పది రోజులు కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేని ప్రభుత్వం, లక్షలమంది విద్యార్థులతో పదో తరగతి పరీక్షలు సురక్షితంగా నిర్వహించగలదా? పిల్లల రక్షణపై ప్రభుత్వం చట్టపరమైన హామీని తల్లిదండ్రులకు ఇవ్వగలదా?