అమరావతి: బీజేపీకి తాను దూరం కాలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణం కానున్నాయా అనే చర్చ ప్రారంభమైంది.

కొంత కాలంగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  ఒంటికాలిపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ తీసుకొంటున్న నిర్ణయాలపై సునిశిత విమర్శలు చేస్తున్నారు.

తమ సర్కార్ పై చేస్తున్న విమర్శలకు వైసీపీ కూడ ధీటుగానే సమాధానం ఇస్తోంది. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు తొలుత ఎక్కువగా విమర్శలు చేసేవారు. తాజాగా మంత్రి కొడాలి నాని కూడ ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

కులాలు, మతాల ప్రస్తావన కూడ ఇటీవల కాలంలో ఈ రెండు పార్టీల నేతల మధ్య సాగుతోంది. ఒకరిపై మరోకరు తీవ్ర విమర్శలు గుప్పించుకొన్నారు. గత నెలలో పవన్ కళ్యాణ్ ఇసుక కొరతను నిరసిస్తూ విశాఖ పట్టణంలో లాంగ్ మార్చ్ నిర్వహించారు.ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.

ఈ సభ వేదికగానే పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు కూడ కేంద్ర పెద్దలు తెలుసునని చెప్పారు. పరోక్షంగా మోడీ, అమిత్‌షాలు కూడ తనకు పరిచయం ఉందని చెప్పారు. వైసీపీ నేతలు కేంద్ర పెద్దలను  కలిసిన సమయంలో ఏ రకంగా ఉంటుందో కూడ తనకు తెలుసునని కూడ వ్యాఖ్యలు చేశారు.

 ఈ సభ తర్వాత పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు. బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ బేటీ అయ్యారని ప్రచారం సాగింది. పవన్ కళ్యాణ్  కేంద్ర పెద్దల సహాయంతో  బీజేపీ నేతలను కలిసిన తర్వాత వైసీపీపై దాడిని మరింత పెంచారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకొన్న  నిర్ణయాలపై పవన్ కళ్యాణ్ తన దాడిని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా  పవన్ కళ్యాణ్ బీజేపీ పై సానుకూలంగా తాను ఉన్నట్టుగా ప్రకటించారు. 

అమిత్  షా లాంటి నేతలే కరెక్టు అంటూ ఈ నెల 3వ తేదీన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఈ నెల 4వ తేదీన తిరుపతిలో బీజేపీకి తాను దూరం కాలేదని తేల్చి చెప్పారు.

ప్రత్యేక హోదా విషయంలో తాను బీజేపీతో విభేదించినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను బీజేపీకి దూరం కాలేదన్నారు టీడీపీతో తాను కలిసి పోటీ చేస్తే తనను విమర్శిస్తున్న నేతలు ఎక్కడుండే వారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో పాటు టీడీపీ అనుసరించిన విధానాలను వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

జిల్లాల వారీగా చంద్రబాబునాయుడు కూడ పర్యటిస్తూ బీజేపీకి అనుకూలంగా ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా విషయంలోనే తాను బీజేపీకి దూరమైనట్టుగా చెప్పారు. మోడీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కొనేందుకు వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయా లేదా బీజేపీ, జనసేనలు కలిసి అడుగులు వేస్తాయా అనే చర్చ ప్రస్తుతం సర్వత్రా సాగుతోంది.

ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు గాను బీజేపీ జనసేనకు ఆహ్వానం పలుకుతోందా అనే చర్చ కూడ లేకపోలేదు.  వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో బీజేపీ గణనీయమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉందని  ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.  ఈ తరుణంలో పవన్ కళ్యాణ్  కమలం పార్టీకి దగ్గరైనట్టుగా సంకేతాలు ఇచ్చారు.

టీడీపీ కూడ ఇదివరకే ఈ రకమైన సంకేతాలు ఇచ్చింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల సమయంలో  మోడీపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే వచ్చే ఎన్నికల్లో 2014 ఎన్నికల మాదిరిగానే ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయితే  ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు. 

ఎన్నికల సమయంలోనే పొత్తుల విషయమై స్పష్టత రానుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ, జనసేనలతో కలిసి ప్రయాణం చేసే విషయమై ఎలాంటి చర్చలు జరగలేదని టీడీపీ శాసనససభపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు ప్రకటించారు.

వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాల కోసం ఇప్పటినుండే రంగం సిద్దమౌతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పరమార్థం అదేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.