లోకేష్! గుర్తుంచుకో!! : పవన్ కల్యాణ్

లోకేష్! గుర్తుంచుకో!! : పవన్ కల్యాణ్

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా  లోకేశ్‌కు కూడా తానంటే కోపమెక్కువ అంటూ "లోకేష్! మీ ప్రభుత్వం నిలబడడానికి నేనే కారణమని గుర్తుంచుకో" అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. టీడీపీ, వైసీపీ నాయకులు భయపెడితే చేతులు కట్టుకుని కూర్చోబోమని అన్నారు.

పవన్‌ ఎవరో తనకు తెలియదని ఎంపీ అశోక్‌గజపతిరాజు అన్నారని గుర్తు చేస్తూ "మీ కోట వద్దకు వచ్చి మాట్లాడుతున్నా.. నేనే పవన్‌. మీరు అనుభవిస్తున్న పదవి 2014లో నేను ప్రచారం చేస్తేనే వచ్చిందన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి" అని అన్నారు.

 విజయనగరం జిల్లా పోరుయాత్రలో భాగంగా శనివారం ఆయన విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. భోగాపురం, విజయనగరం కోటజంక్షన్‌ వద్ద జరిగిన సభల్లో ప్రసంగించారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బొత్స సత్యనారాయణపై కూడా ఆయన విరుచుకుపడ్డారు.
 
రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చిన కాంగ్రెస్‌ పార్టీలో బొత్స సత్యనారాయణ ఉండేవారని, ఇప్పుడు వైసీపీలో ఉన్నారని, నాటి కాంగ్రెస్‌ నాయకులే వైసీపీలో ఉంటూ బ్రాందీ వ్యాపారాలు, తెలంగాణలో కేబుల్‌ వ్యాపారాలు చేసుకుంటూ ఏళ్ల తరబడి నాయకులుగా చెలామణి అవుతున్నారని ఆయన అన్నారు. 

విజయనగరం జిల్లా ప్రజల తెగువ నాకు తెలుసునని తెలంగాణ వస్తే ఏమవుతుందని అన్నందుకే విజయనగరంలో 14 రోజులు కర్ఫ్యూ వాతావరణం ఏర్పడిందని, అంతటి తెగువకలిగిన యువత జిల్లాలో ఉందన్న విషయాన్ని ఇక్కడి నాయకులు గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

తాను షూటింగ్‌కు వెళ్లినా ప్రజాసేవ కోసమే ఆలోచిస్తానని, రూ.25 కోట్లు టాక్స్‌ కట్టేవాడినని, కోట్లు తెచ్చివ్వలేని సంతృప్తి ప్రజా సేవలో ఉందని నమ్మి రాజకీయాల్లోకి వచ్చానని, ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని తనకు ఎరవేశారని అంటూ వారిచ్చేదేంటి.. నేనే గెలుచుకుంటానని అన్నారు.
 
విజయనగరం పట్టణానికి స్మార్టు సిటీ అవార్డు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని, ఎక్కడ చూసినా కుక్కలు, పందులే కనిపిస్తున్నాయని అన్నారు. భోగాపురం విమానాశ్రయానికి 15వేల ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నించారని, రైతులు, స్థానికులు తిరగబడడంతో తొలుత 5300 ఎకరాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారని, తర్వాత 2600 ఎకరాలు మాత్రమే తీసుకుని మిగతా భూమికి నేటివరకూ డీనోటిఫికేషన్‌ ఇవ్వలేదని ఆయన అన్నారు. దానివల్ల కొందరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు కూడా జరగడం లేదని అన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page