తాడేపల్లిగూడెం:  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై, ఆయన కుమారుడు నారా లోకేష్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. మా అమ్మను దూషిస్తారా, క్షమించను, ఖబడ్దార్ అని ఆయన హెచ్చరించారు. అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు సమానమైన గౌరవం ఇస్తామని అన్నారు. 

ఎదురు పడితే ప్రేమగా మాట్లాడుతారు, వెనక నుంచి వెన్నుపోట్లు పొడుస్తారని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. వెన్నుపోట్లు పొడిపించుకోవడానికి తాను ఎన్టీఆర్ ను కానని, ఎన్టీఆర్ మంచివారూ అమాయకుడూ అని, తనకు వెన్నుపోటు పొడవాలని చూస్తే సహించబోమని అంటూ ఖబడ్దార్ అని హెచ్చరించారు. 

ప్రతిపక్ష నేత పోరాడాల్సింది పోయి అసెంబ్లీ నుంచి పారిపోతారని, అలా అంటే బాధపడుతారని ఆయన అన్నారు.  రాజకీయ ప్రక్షాళన కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు టీడీపి ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని, టీడీపికి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాకు టీడీపివాళ్లు తూట్లు పొడిచారని అన్నారు. 

తాను ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటే జనసేనకు జెండా లేదు, ఎజెండా లేదని మాట్లాడుతున్నారని, ఎజెండా, జెండా లేకుండానే ఇంత మంది వచ్చారా అని పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఏరు దాటాక తెప్ప తగలేస్తోందని ఆయన అన్నారు. అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు నమస్కారం చేస్తారని, వారిలా తనకు పత్రికలు లేవని, వేల కోట్లు లేవని ఆయన అన్నారు. జనసైనికులు తప్ప తనకు బలం లేదని అన్నారు. 

మీ నుంచి ఏదీ ఆశించినని, డబ్బులు ఆశించనని, కోట్ల సంపాదన వదులుకున్నానని, ప్రతి జిల్లాల్లో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని చంద్రబాబును కోరారని చెబుతూ అలా కోరడమే తప్పయిందా అని అడిగారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు ఇస్తే తన తల్లిని దూషించారని, టీడీపి వాళ్లను తాను తాను క్షమించబోనని అన్నారు. తమ అడపడుచులను అవమానించారని, ఖబడ్డార్ అని అన్నారు. వెన్ను పోటు రాజకీయాలు చేయదలుచుకుంటే జగన్ తోనో, మరెవరితోనో చేసుకోవాలని అన్నారు. 

తాను ఎంతగా ప్రేమిస్తానో, అండగా ఉంటానో అంతగా అరుస్తానను, చరుస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. తమ ఆడపడుచుల మీద దుష్ప్రచారం చేస్తే సహించబోనని అన్నారు. నారా లోకేష్ లా తాము విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదవులేదని, కానీ తమకు సంస్కారం ఉందని ఆయన అన్నారు. టీడీపి గుండాలకు, రౌడీలకు తాను భయపడబోనని అన్నారు. 

ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతారా, వీధిల్లోకి వచ్చి పోరాడుతారా మీరే నిర్ణయించుకోవాలని, దేనికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చంద్రబాబును, నారా లోకేష్ ను ఉద్దేశించి అన్నారు.