చంద్రబాబు తిరగడానికే రోడ్లు వేసుకుంటున్నారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan at Kurupam lashes out at CM
Highlights

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరగడానికి మాత్రమే రోడ్లు వేసుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు.

విజయనగరం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరగడానికి మాత్రమే రోడ్లు వేసుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని చంద్రబాబు గాలికి వదిలేశారని విమర్శించారు.

గురువారం విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా 90 శాతం మంది గిరిజనులు ఉన్న కురుపాం నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకోవడానికి వచ్చినట్లు తెలిపారు.

గిరిజనులు, సామాన్యుల సమస్యలను తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పరిష్కరిస్తుందని భావించానని, కానీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఓట్ల కోసం మాత్రమే గిరిజనుల వద్దకు రాజకీయ పార్టీలు వస్తున్నాయని ఆరోపించారు. మహానాడు కోసం మంచినీళ్లలా డబ్బును ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పూర్ణపాడు లేబేసు వంతెనను నిర్మించలేకపోతోందని విమర్శించారు. కురుపాంలో కనీస వైద్య సౌకర్యాలు కూడా లేవని అ‍న్నారు. 

మంచి నీరు వెళ్లలేని ప్రాంతాలకు సైతం కూల్‌డ్రింక్స్‌, మద్యం ఎలా వెళ్తోందని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో కళింగ ఉద్యమం వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు.

loader