తెనాలి, గుంటూరు అభ్యర్థులు వీరే: పవన్ కల్యాణ్ ప్రకటన
First Published Jan 28, 2019, 10:52 AM IST
వచ్చే శానససభ ఎన్నికల్లో పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. గుంటూరులో ఆయన ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
తెనాలి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పేరును, గుంటూరు అభ్యర్థిగా తోట చంద్రశేఖర్ పేరును పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్టీ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. మతపెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించి, పవన్ కల్యాణ్ గారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్యనేతలు శ్రీ నాదెండ్ల మనోహర్, శ్రీ తోట చంద్రశేఖర్, మాజీమంత్రి శ్రీ రావెల కిశోర్ బాబు, శ్రీ మాదాసు గంగాధరంతో పాటు పలువురు నాయకులు, పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం బిజెపి, ప్రధాని మోడీ మరిచిపోవచ్చు కానీ జనసేన పార్టీ మరిచిపోదని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదాపై పోరాడేందుకు అన్ని పార్టీలూ ఏకతాటిపైకి రావాలని, అందుకే మాజీ లోక్ సభ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రత్యేక హోదా సాధనకై ఏర్పాటు చేసిన సమావేశానికి జనసేన పార్టీ హాజరవుతుందని పవన్ తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సమస్యలపై అన్ని పార్టీలు ఒకటై పోరాటం చేస్తే ఢిల్లీ దద్దరిల్లిపోవాలని పవన్ అన్నారు. గుంటూరు వేదికగా జరిగిన జనసేన శంఖారావం సభలో పవన్‌కళ్యాణ్ ప్రసంగించారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అఖండ విజయం సాధించి చట్టసభలోకి అడుగుపెడుతుందని, అధికారానికి దూరంగా ఉన్న బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకుని అమరావతి పై జనసేన జెండ రెపరెపలాడిస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా నుంచి తోట చంద్రశేఖర్ , రావెల కిశోర్ బాబు, నాందెడ్ల మనోహర్ లను భారీ మెజార్టీతో గెలిపించి గుంటూరు గడ్డపై జనసేన జెండా ఎగరవేస్తామని పవన్ అన్నారు.
2019 లో తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారో, లేదో తెలియదు గానీ జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చిన రోజున మాత్రం ఖచ్చితంగా ఒక బలమైన సామాజిక మార్పు తీసుకువస్తానని పవన్ అన్నారు.
జనసేన ప్రభుత్వంలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే విధానాన్ని తీసుకువస్తామని, తన బిడ్డ చదివే స్కూల్లో అందరి బిడ్డలు చదవాలని ఆయన అన్నారు.
తన బిడ్డ వైద్యం చేయించుకునే ఆస్పత్రిలోనే అందరి బిడ్డలకీ వైద్య సదుపాయం దక్కాలని పవన్ అన్నారు. అవి ప్రభుత్వ సంస్థలు అయి ఉండాలని, అలాంటి మార్పు తీసుకురావడమే తన లక్ష్యమని పవన్ అన్నారు.
యువత ఫ్లెక్సీల కోసం కొట్లాడుకుంటున్నారు అంటే, అదీ పాలకుల తప్పిదమేనని పవన్ అన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు, క్రీడా ప్రాంగణాలు కల్పిస్తే వారు రోడ్ల మీద బైకుల్లో ఎందుకు తిరుగుతారని ప్రశ్నించారు.
రాజకీయ నాయకులు చేసిన తప్పులకు మనం ఎందుకు బాధలు పడాలని, ఎప్పుడో 1960 ల్లో జరిగిన తప్పులకు 2014 లో మనం బాధపడటం తనకు నచ్చలేదని పవన్ అన్నారు.
ప్రజా బలం, ఉండి, ఇంతటి శక్తి ఉన్న నాలాంటివాడు కూడా ప్రజా సమస్యలపై పోరాడకుండా వెనుకడుగు వేస్తే అసమర్థుడు గెలిచినట్లు అవుతుందని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు.
జీవితాంతం సినిమాలు చేసుకుంటూ, తన కుటుంబం, పిల్లలు బాగుంటే చాలా లేక నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల జీవితాలు కూడా బాగుండాలా అన్న ఆలోచనే తను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని పవన్ అన్నారు.
తన దగ్గర డబ్బుల్లేవని, కానీ నేను బయటకు వస్తే తనను నమ్మి తన వెనుక నడిచే కోట్లాది మంది ప్రజలు వస్తారనే నమ్మకం తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని పవన్ అన్నారు.
దెబ్బ పడే కొద్దీ బంతిలా ఎగసిపడి మార్పును బలంగా సాధిస్తామని పవన్ అన్నారు. తనకు ఆస్తులు పోతాయనే భయం లేదని, తాను అన్నింటికీ సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
ఇక్కడ ఇంతమంది యువత ఉన్నారు, నాయకులకు యువతను చూస్తే ఓటు వేసే మెషీన్లు లా కనిపిస్తారు, తనకు నిండు మనసుతో ఉన్న నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళులా కనిపిస్తారని పవన్ అన్నారు.
జగన్ మాట్లాడితే వచ్చే ముప్పై ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి గా ఉండాలి అంటారని పవన్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళీ నేనే ముఖ్యమంత్రి కావాలి, నా తరవాత నా కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారని అన్నారు.
తాను ఇతర పార్టీ నాయకులను ఎగతాళి చేయడం లేదని పవన్ అన్నారు. ఏ యువకుడినైనా అడగండి మాకు రెండు వేల రూపాయలు, పాతిక కేజీల బియ్యం కాదు మా కాళ్ల మీద మేము నిలబడేందుకు పాతికేళ్ల భవిష్యత్ కావాలని కోరుకుంటున్నారని అన్నారు.
Today's Poll
Please select an option to vote
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?