విజయవాడ: బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కన్నా నియామకం వెనక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోణం కూడా ఉందని చెబుతున్నారు. పరిస్థితిని బట్టి కన్నా లక్ష్మినారాయణ పవన్ కల్యాణ్ తో సంబంధాలను నెరగలరని బిజెపి జాతీయ నాయకత్వం భావించినట్లు తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాల్సిన పరిస్థితిలోనే ఉంది. కాంగ్రెసుతో గానీ వామపక్షాలతో గానీ కలిసి నడిచే అవకాశం బిజెపికి లేదు. తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీల్లో ఏదో ఒక పార్టీతో కలిసి నడవాల్సి ఉంటుంది.

ఎన్నికలకు ముందు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని జగన్ స్పష్టంగానే చెప్పారు. అయితే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి హామీ ఇస్తే ఎన్నికలకు ముందు పొత్తుకు అవకాశం ఉంది. ఎన్నికల తర్వాత ఆయన బిజెపితో కలిసి నడిచే అవకాశం లేకపోలేదు. ఆ మాటకొస్తే వైఎస్ జగన్ తోనూ కన్నాకు మంచి సంబంధాలే ఉన్నాయి.

విస్తృతమైన రాజకీయానుభవం ఉన్న కన్నా పార్టీకి రాష్ట్రంలో ఉపయోగపడగలరని భావించి ఉంటారు. నిజానికి, సోము వీర్రాజుకు రాష్ట్రాధ్యక్ష పదవిని ఇవ్వాలని అనుకున్నారు. కానీ, ఆయన ఏకపక్ష వ్యవహారశైలి పార్టీలో చాలా మందికి నచ్చలేదని అంటున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేయగల నాయకుడి అవసరం ఉందని బిజెపి జాతీయ నాయకత్వం భావించినట్లు తెలుస్తోంది.

సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని వార్తలు రావడంతో కన్నా లక్ష్మినారాయణ వైసిపిలోకి లేదా తెలుగుదేశంలోకి వెళ్లాలని అనుకున్నారు. దాంతో బిజెపి జాతీయాధ్యక్షుడు అప్రమత్తమై కన్నా లక్ష్మినారాయణను నిలువరించారు. ఇచ్చిన హామీ మేరకు ఆయనను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు. 

సంఘ్ నేపథ్యం లేని కన్నా లక్ష్మినారాయణకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం కాస్తా ఆశ్చర్యకరమే అయినప్పటికీ పార్టీని ముందుకు నడిపించడానికి అవసరమని నాయకత్వం భావించినట్లు చెబుతున్నారు. అసోంలో సంఘ్ నేపథ్యంలో ని సర్బానంద సోనోవాల్ ను పార్టీలో చేర్చుకుని ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయనను ముఖ్యమంత్రిని చేశారు.

తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపి పట్ల మెతకవైఖరి అవలంబిస్తున్నారనే కారణంతోనే కంభంపాటి హరిబాబును పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే మాట వినిపిస్తోంది. 

రాష్ట్రంలో కాపు సామాజికవర్గానికి చెందిన నేతకు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని బిజెపి నాయకత్వం భావించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని చెప్పే పార్టీలు ఇప్పటికే మనుగడలో ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధపడ్డారు. అయితే, కాపు ముద్ర పడకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు.

కానీ, కన్నా లక్ష్మినారాయణ పరిస్థితి వేరు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవారే అయినప్పటికీ ఇతర సామాజిక వర్గాలను కలుపుకుని ముందుకు నడిపించగలిగే రాజకీయానుభవం ఆయనకు ఉందని చెబుతున్నారు