జగన్‌ను మించిన పవన్.. తగ్గినా నెగ్గావ్ గురూ
చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో నారా లోకేశ్, బాలకృష్ణ, ఇతర నాయకులతో సమన్వయం చేసుకుంటూ పొత్తు ఖరారు చేశారు. అలాగే, బీజేపీతో పొత్తు విషయాన్ని ఒప్పించడంలోనూ కీలక పాత్ర పోషించారు.
'మనల్నెవడ్రా ఆపేది... హలో ఏపీ బైబై వైసీపీ.... జగన్ గుర్తుపెట్టుకో అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు. నా పార్టీ జనసేనే కాదు..' అంటూ ఎన్నికల ప్రచార బరిలో జనసేనాని పవన్ కల్యాణ్ వారాహిపై నుంచి చేసిన ప్రసంగాలు ఇప్పుడు నెట్టింట, బయట మార్మోగుతున్నాయి. పవన్ అన్నట్లుగానే శపథం నెరవేర్చుకున్నారు. రికార్డు విక్టరీ సాధించారు. తన రణ క్షేత్రమైన పిఠాపురంలో జనసేన జెండా రెపరెపలాడించారు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ అండగా నిలిచారు. అక్రమ కేసుల్లో చంద్రబాబును జగన్ ప్రభుత్వం జైలు పాలు చేసిన వేళ... బాబును పరామర్శించారు. తెలుగుదేశం కేడర్‌లో ధైర్యం సన్నగిల్లుతున్న తానున్నంటూ ముందుకు వచ్చి... టీడీపీ కేడర్‌లో లేని జోష్‌ని నింపారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో నారా లోకేశ్, బాలకృష్ణ, ఇతర నాయకులతో సమన్వయం చేసుకుంటూ పొత్తు ఖరారు చేశారు. అలాగే, బీజేపీతో పొత్తు విషయాన్ని ఒప్పించడంలోనూ కీలక పాత్ర పోషించారు. వైసీపీ వేసిన నక్కజిత్తుల ఎత్తులన్నింటినీ పటాపంచెలు చేస్తూ... ఎప్పటికప్పుడు ఒకడుగు ముందే ఉన్నారు.....
గత ఎన్నికల్లో (2019)లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన ఒక్క సీటుకే పరిమితమైంది. పవన్ కల్యాణ పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఓటమిపాలయ్యారు. కోనసీమ జిల్లా రాజోలులో రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచినా.. వైసీపీలోకి జంప్ అయిపోయారు. ఇతర ఏ స్థానంలోనూ జనసేన విజయం సాధించలేదు. ఆ సమయంలో జనసైన పనైపోయిందన్న విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకానొక దశ ప్రజారాజ్యం మాదిరిగానే పవన్ కూడా పార్టీ మూసేస్తారన్న వదంతులు వినిపించాయి. మరోవైపు ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ దారుణంగా ట్రోల్ చేసింది. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్నీ వదలకుండా సీఎం జగన్ మొదలు, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులంతా విచక్షణ మరిచి దూషణలు చేసినా... పవన్ కుంగిపోలేదు. అధికారంలో ఉన్న వైసీపీ జనసేన సమావేశాలను అడ్డుకున్న వెనుకంజ వేయలేదు. పర్యటనలకు వెళ్లినప్పుడు కారులోంచి కదలొద్దని, హోటల్ గదుల్లో నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం దారుణమైన ఆంక్షలు పెట్టినా భరించారు.
నువ్వు తొక్కే కొద్దీ నేను లేస్తానంటూ గత ఐదేళ్లపాటు జనసేనను పవన్ కల్యాణ్ నడిపించారు. ఎంత మంది నాయకులు పార్టీని వీడినా తగ్గేదే లేదన్నట్లు ముందుకు సాగారు. నిజాయతీ పరులైన కార్యకర్తలే తన సైన్యమంటూ జనసైనికులు, వీర మహిళల్లో నిత్యం ధైర్యం నింపారు. కేడర్ దూరం కాకుండా చూసుకున్నారు. ముద్రగడలాంటి సొంత కులం నాయకులే ఆయన్ను హేళన చేస్తున్నా... ఎక్కడా లైన్ తప్పకుండా తనదైన శైలిలో కౌంటర్‌లు ఇచ్చారు. మాటలు కాకుండా చేతల్లోనే సమాధానం చెప్పారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూనే... కష్టాల్లో ఉన్న ప్రజలకు తానున్నానంటూ భరోసా కల్పించారు. అన్నదాతలు, చేనేత కార్మికులు, మత్స్యకార కుటుంబాలు... ఇలా అన్ని వర్గాలకు అండగా నిలిచారు. పార్టీ ఫండ్‌తో పాటు తన సొంత సంపాదనను బాధిత కుటుంబాలకు పంచి పేదల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ దూకుడుగా వ్యవహరించారు. జగన్ పార్టీకి చెక్ పెట్టేలా రాజకీయ వ్యూహాలు రచించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమంటూ.. తనను తానూ తగ్గించుకున్నారు. తక్కువ సీట్లతోనే పోటీకి వెళ్లి విజయం సొంతం చేసుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా పిఠాపురాన్ని తన రణ క్షేత్రంగా ఎంచుకొని విజయాన్ని ముద్దాడారు. తను ఓడించాలని ప్రయత్నించిన ఉద్ధండులను పన్నాగాలను పటాపంచెలు చేస్తూ ఎత్తుకు పైఎత్తు వేశారు.
చివరికి పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మించి ఆధిక్యం సాధించారు. పులివెందులలో జగన్ 59వేల మెజారిటీ సాధిస్తే... అంతకు పైచేయి అని నిరూపించుకున్నారు పవన్ కల్యాణ్. జగన్ పులివెందులలో 59 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తే... పవన్ కల్యాణ్ పిఠాపురంలో 70వేలు ఆధిక్యం ప్రదర్శించారు. 17 రౌండ్లు ముగిసే సరికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలపకుండానే 69వేల 169 ఓట్ల మెజారిటీని పవన్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీయే విజయంలో కింగ్ మేకర్ అయ్యారు. ముందు నుంచి అన్నట్లుగానే వైసీపీ అధః పాతాళానికి తొక్కారు.......