Asianet News TeluguAsianet News Telugu

మాజీలకు పవన్ వల:చిక్కుకున్న ఆ నలుగురు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల కసరత్తు ప్రారంభించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఉత్తరాంధ్రను చుట్టేసిన పవన్ కళ్యాణ్ అభ్యర్థుల వేట ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కు వాణిజ్య రాజధానిగా చెప్పుకునే విశాఖపట్నం జిల్లాపై పవన్ ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు జనసేనకు కీలక నేతల ప్రాతినిధ్యం కరువైంది.

Pawan invites veteran leaders Dadi, konathala, balaraju,mutyalapapa  to join Jana Sena
Author
Visakhapatnam, First Published Oct 17, 2018, 3:23 PM IST

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల కసరత్తు ప్రారంభించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఉత్తరాంధ్రను చుట్టేసిన పవన్ కళ్యాణ్ అభ్యర్థుల వేట ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కు వాణిజ్య రాజధానిగా చెప్పుకునే విశాఖపట్నం జిల్లాపై పవన్ ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు జనసేనకు కీలక నేతల ప్రాతినిధ్యం కరువైంది. అందులో భాగంగా పవన్ ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా ఉండే ఒక నాయకుడిని వెతికే పనిలో పడ్డారు. తటస్థంగా ఉన్నమాజీలకు పవన్ వలవేశారు. 

పవన్ వేసిన వలలో నలుగురు మాజీ నేతలు చిక్కిచిక్కనట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీమంత్రి సీనియర్ నాయకుకడు కొణతాల రామకృష్ణ, మాజీమంత్రి పసుపులేటి బాలరాజు, సీనియర్ నేత దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాలపలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.  

తిత్లీ తుఫాన్ ధాటికి సర్వం కోల్పోయిన శ్రీకాకుళం జిల్లాలో బాధితులను పరామర్శించేందుకు మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. ఓ రిసార్ట్స్ లో బస చేసిన పవన్ కళ్యాణ్ ను మాజీమంత్రి పసుపులేటి బాలరాజు కలిశారు. అయితే పవన్ కలిసిన విషయం మాత్రం బయటపెట్టడం లేదు పసుపులేటి బాలరాజు. పవన్ కళ్యాణ్ వచ్చిన విషయం తనకు తెలియదని దాటవేశారు. 

ఇకపోతే పసుపులేటి బాలరాజు మంత్రిగా ఉన్నప్పుడు నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా పనిచేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలోకి చేరడంతో ఆయన సన్నిహితుడైన బాలరాజు కూడా జనసేనకు జై కొడతారని అంతా ఊహించారు. సరిగ్గా అదే సమయంలో పసుపులేటి బాలరాజు రుషికొండలో అందులోనూ పవన్ బస చేసిన రిసార్ట్ లో దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. 

అటు మాజీమంత్రి దాడి వీరభద్రరావును సైతం పార్టీలోకి రావాలంటూ జనసేన ఆహ్వానం పలికినట్లు సమాచారం. దాడి వీరభద్రరావు తనయుడు దాడి రత్నాకర్ కు అనకాపల్లి టిక్కెట్ ఆఫర్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అటు పాయకరావు పేట నియోజకవర్గానికి సంబంధించి మాజీఎమ్మెల్యే చెంగల వెంకట్రావు  కుటుంబ సభ్యుల్లో ఒకరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే యలమంచిలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున టిక్కెట్ ఆశించి ఆఖరి నిమిషంలో భంగపడ్డ సుందరపు విజయ్ కుమార్ సైతం జనసేనలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. 

ఇప్పటికే రెండు మూడు నియోజకవర్గాల నుంచి మాజీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీలోకి జంప్ అయ్యారు. చోడవరం నియోజకవర్గానికి చెందిన పీవీఎస్ ఎస్ రాజు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయన చోడవరం టిక్కెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే నియోజకవర్గానికి చెందిన కరణం ధర్మశ్రీని కూడా జనసేన తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కరణం ధర్మశ్రీ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అలాగే గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య సైతం జనసేన పార్టీలో చేరారు. ఆయన జనసేన తరపున గాజువాక నుంచి పోటీచెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. 

నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు. ఆమెను కూడా జనసేన ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. బోళెం ముత్యాలపాప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని అంతా భావించారు. విశాఖపట్నం జిల్లాలో జగన్ పాదయాత్రలో ఆమె వైసీపీ కండువా కప్పుకోనున్నారని ప్రచారం జరిగింది. విశాఖపట్నంలో జగన్ పాదయాత్ర అయిపోయింది...విజయనగరం జిల్లాలో దాదాపు సగంపైగా పూర్తైంది. కానీ ఇప్పటికీ ఆమె వైసీపీలోకి వెళ్లనే లేదు. దీంతో తటస్థంగా ఉన్న ఆమెను జనసేన తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. 

ఇకపోతే మాజీ మంత్రి, సీనియర్‌ నేత కొణతాల రామకృష్ణ జనసేనలోకి వస్తే ఆయనకు అనకాపల్లి ఎంపీగా అవకాశం ఇస్తానని జనసేన ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కొణతాల జనసేనలోకి జంప్ అయితే ఆయన శిష్యుడు పీవీజీ కుమార్ సైతం జనసేనలోకి జంప్ అవుతారని తెలుస్తోంది. పీవీజీ కుమార్ మాడుగుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని ఆశిస్తున్నారు. అటు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సైతం జనసేన పార్టీలోకి చేరేందుకు రెడీ అవుతున్నారు. 

ఇదిలాఉంటే విశాఖపట్నం జిల్లాలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీవైపు ఆసక్తికనబరుస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ పార్టీలలో పనిచేసి, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం కోసం ఎదురుచూసి భంగపడిన నేతలు సైతం తమ అదృష్టాన్ని  పరీక్షించుకునేందుకు జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios