జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు. అదేంటంటే కేంద్రప్రభుత్వంపై  పార్లమెంటులో వైసిపి అవిశ్వాసతీర్మానం ప్రవేశపెడితే తాను మద్దతుగా నిలుస్తాడట. కేంద్రప్రభుత్వంపై తాము అవిశ్వాసతీర్మానం పెట్టటానికి సిద్ధమంటూ జగన్ చేసిన ప్రకటనను తాను స్వీకరిస్తున్నట్లు పవన్ చెప్పారు.

ప్రత్యేకహోదా అన్నది ఏ ఒక్క పార్టీకో సంబంధించిన విషయం కాదుకాబట్టి పార్టీ రహితంగా అందరూ ఎంపిలు కలసి రావాలని పవన్ పిలుపునిచ్చారు. వైసిపి గనుక అవిశ్వాసతీర్మానంకు నోటీసిస్తే తాను స్వయంగా డిల్లీకి వచ్చి మిగిలిన పార్టీల మద్దతు కూడగడుతానంటూ భరోసా ఇచ్చారు.

మార్చి 5వ తేదీన పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే సమయానికి వైసిపి నోటీసివ్వాలని సూచించారు. ఒకవేళ వైసిపి గనుక నోటీసు ఇవ్వలేకపోతే టిడిపినే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూడా పవన్ చెప్పారు. అసలు చంద్రబాబునాయుడు, జగన్ ఇద్దరూ కేంద్రప్రభుత్వానికి భయపడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టటానికి ఒక్క ఎంపి సరిపోతారని కాకపోతే మద్దతు కూడగట్టటంలోనే సమస్య ఎదురవుతుందన్నారు.

వైసిపి అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టగానే తాను ఢిల్లీకి వచ్చి అందరు పార్టీల నేతలతోను మాట్లాడి మద్దతు కూడగడతానని చెప్పారు. టిడిపి, వైసిపిలు అవిశ్వాసతీర్మానంపై కమిట్ అయ్యారుకాబట్టి అవిశ్వాస తీర్మానంపై ముందుకెళ్ళాలన్నారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ముస్లింలీగ్, జనతాదళ్, సిపిఐ, సిపిఎం పార్టీల మద్దతు తాను కూడగడతానన్నారు. అవిశ్వాసతీర్మానంపై చర్చకు స్పీకర్ ఆమోదం పొందటానికి 50 మంది ఎంపిల సభ్యులు కాదని 80 మంది ఎంపిల మద్దతు తప్పక వస్తుందన్నారు. రాజకీయాల్లోకి అన్నింటికీ తెగించే వచ్చానన్నారు.