నెల్లూరు: చాలా కాలం తర్వాత మళ్లీ ప్రజాశాంతి అధ్యక్షుడు కెఎ పాల్ తెలుగు రాజకీయాల్లో సందడి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన తన సహజశైలిలో మాటల మూట విప్పుతున్నారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలుస్తారా అని అడిగితే అటువంటి సంకేతాలు వస్తే ఆలోచిస్తామని జవాబిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు వ్యతిరేకంగా తాము పనిచేస్తామని చెప్పారు. 

దేశంలో 18 రాష్ట్రాల్లో పలు పార్టీలను తామే గెలిపించామని ఢంకా బజాయించుకున్నారు. తెలంగాణలో పోటీకి తమకు సమయం సరిపోలేదని పాల్ అన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్, చంద్రబాబు విజయం వెనక తమ పార్టీ ప్రభావం ఉందని చెప్పుకున్నారు. 

తమ పార్టీ నిర్మాణంలో హిప్నో కమలాకర్ చురుగ్గా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీలో పది మందిని చేర్పించినవారికి టికెట్ ఇస్తామని చెప్పారు. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, కలిసి వచ్చే పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. మొత్తం పాల్ సందడి ఎపి రాజకీయాల్లో వినోదాన్ని పంచుతున్నాయి.