గన్నవరంలో టీడీపీ, వంశీ వర్గీయుల ఘర్షణ: కోర్టుకు పట్టాభి సహ 15 మంది
గన్నవరంలో నిన్న జరిగిన ఘర్షణకు సంబంధించి పట్టాభి సహ 15 మంది టీడీపీ నేతలను పోలీసులు కోర్టులో హజరుపర్చారు.
గన్నవరం: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సహ 15 మంది నేతలను పోలీసులు మంగళవారం నాడు కోర్టులో హజరుపర్చారు. పోలీసులు కోర్టుకు పట్టాభి సహ ఇతర టీడీపీ నేతలను తీసుకువస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆ పార్టీ నేతలు కోర్టుకు చేరుకున్నారు.
సోమవారం నాడు సాయంత్రం టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ వర్గీయులు దాడికి దిగారు. పార్టీ కార్యాలయంలో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. అంతేకాదు టీడీసీ కార్యాలయంలోని ఆవరణలో కారుకు నిప్పు పెట్టారు. నిన్నటి నుండి గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గన్నవరంలో ఘటన నేపథ్యంలో డీజీపీ ని కలిసేందుకు వెళ్తున్న పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టాభిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం పట్టాభి సహ 15 మందిని కోర్టులో హజరుపర్చారు పోలీసులు టీడీపీ నేతలను కోర్టుకు హజరుపర్చే సమయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
also read:పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే శాంతిభద్రతలకు విఘాతం: ఎస్పీ జాషువా
నాలుగు రోజుల క్రితం టీడీపీ అగ్రనేతలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలు చేశారు.ఈ విమర్శలపై టీడీపీ స్థానిక నేతలు కౌంటరిచ్చారు. ఈ విషయమై తన మనుషులను పంపి బెదిరింపులకు పాల్పడ్డారని టీడీపీ నేతలు వంశీపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనలపై పోలీసులకు పిర్యాదు చేసేందుకు సోమవారం నాడు టీడీపీ నేతలు ర్యాలీగా బయలుదేరారు. ఈ సమయంలో ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వంశీ వర్గీయులు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు.
ఈ దాడిని నిరసిస్తూ హైద్రాబాద్- విజయవాడ జాతీయరహదారిపై టీడీపీ శ్రేణులు రాస్తారోకి నిర్వహించాయి. రాస్తారోకో చేసిన టీడీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. సోమవారం నాడు రాత్రి టీడీపీ నేత చిన్నా కారుకు వంశీ వర్గీయులు నిప్పు పెట్టారు. దీంతో టీడీపీ శ్రేణులు నిన్న రాత్రి ఆందోళనకు దిగారు.