అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన కీలక నాయకుడు రాజీనాామా చేసి షాకిచ్చారు.
అవనిగడ్డ : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అధికార వైసిపికి బిగ్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుల్లో ఒకరిగా పేరున్న పరుచూరి సుభాష్ చంద్రబోస్ కీలక ప్రకటన చేసారు. వైసిపి పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని... అందువల్లే తాను పార్టీని వీడుతున్నట్లు చంద్రబోస్ వెల్లడించారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసిపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో జగన్ వెంట నడిచిన వారిలో చంద్రబోస్ కూడా వున్నారు. ఈ సమయంలోనే జగన్ సన్నిహితంగా మెలిగి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు చంద్రబోస్. అలాంటిది ఆయన పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
వీడియో
అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో చంద్రబోస్ ప్రభావం అధికంగా వుంటుంది. అలాగే 50మంది వైసిపి నాయకులు, అనుచరులు, భారీగా కార్యకర్తలతో కలిసి చంద్రబోస్ తో కలిసి పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. ఇది అవనిగడ్డ నియోజకవర్గంలో వైసిపికి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.
Read More వైసీపీ ముక్త ఏపీనే లక్ష్యం.. బీజేపీ కూడా కలిసి నడుస్తుందనే నమ్మకం.. పవన్ ప్రయత్నం అదే: నాదెండ్ల
ముందు చూపు లేకుండా వైపిపి ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సుభాష్ చంద్రబోస్ తెలిపారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిలా జగన్ సుపరిపాలన అందిస్తాడని భావించానని... కానీ మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం గృహ నిర్మాణంలో పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. ఇలాంటి పార్టీలో వుండలేకపోతున్నానని... అందువల్లే రాజీనామా చేస్తున్నట్లు చంద్రబోస్ వెల్లడించారు.
