వైసీపీ ముక్త ఏపీలో అన్ని పార్టీలకు సముచిత స్థానం ఉంటుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ విముక్త ఏపీగా చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని చెప్పారు.

వైసీపీ ముక్త ఏపీలో అన్ని పార్టీలకు సముచిత స్థానం ఉంటుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలనివ్వనని.. ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ విముక్త ఏపీగా చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్‌కు సంబంధించి వివరాలను నాదెండ్ల మనోహర్ ఈరోజు మీడియాకు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పవన్ చర్చించారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు గురించి ఆయన కొన్ని వివరాలు తమతో పంచుకున్నారని.. ఆ వివరాలు ఆశ్చర్యం కలిగించాయని అన్నారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాయితీగా చిత్తశుద్దితో పోలవరం పూర్తి చేయాలనే ఆలోచన చేయలేదని చెప్పారు. పోలవరంపై సీఎం జగన్ ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారని విమర్శించారు. రివర్స్ టెండరింగ్‌ పేరుతో కాంట్రాక్టర్‌ను మార్చారని.. రూ. 800 కోట్లు రాష్ట్ర ప్రజలకు ఆదా చేస్తున్నామని చెప్పారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని పలు గడువులు ప్రకటించారని.. 2022లో పోలవరం నుంచి సాగునీరు ఇస్తామని జగన్ చెప్పారని అన్నారు. అయితే ఇప్పుడు కేంద్రం సహకరించడం లేదని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

పోలవరం ఎత్తును తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు ప్రభుత్వం ఒప్పుకుందా? లేదా? అనేది సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పోలవరం నిధులను సక్రమంగా వినియోగించడం లేదని ప్రశ్నించారు. ఏడాది కాలంలో పోలవరం పనులు 3 శాతం కూడా జరగలేదని.. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. పోలవరంపై రాజకీయం చేయడం జనసేన ఉద్దేశం కాదని అన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టి త్వరగా పూర్తి చేయాలని కోరారు. పవన్ కల్యాణ్ త్వరలో పోలవరంలో పర్యటిస్తారని.. వివరాలు తెలుసుకుంటారని చెప్పారు. 

వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చనివ్వమనే జనసేన అధినేత చెబుతున్న సంగతి తెలిసిందేనని అన్నారు. ఇందుకు సంబంధించిన కారణాలను కూడా బీజేపీ పెద్దలకు వివరించామని చెప్పారు. లోతుగా దీని గురించి చర్చించాలని వారు అన్నారని తెలిపారు. వారు కూడా ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ విముక్త ఏపీగా మార్చేందుకు ముందడగు వేస్తారనే నమ్మకం తమకు కలిగిందని చెప్పారు. ఇది పదవులు, అధికారం కోసం చేస్తుందని కాదని చెప్పారు. 

వైసీపీ ముక్త ఏపీలో అన్ని పార్టీలకు సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. పొత్తులపై పవన్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రతిపక్ష ఓటు చీలకుండా ఉండాలనేది తమ విధానమని.. అందుకోసం పవన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాజకీయాలు అన్నప్పుడు అన్ని అంశాలు చర్చకు రావడం సహజమని చెప్పారు. టీడీపీ పాత్రపైన చర్చ జరిగిందని తెలిపారు. 

రాష్ట్రం కోసం ఢిల్లీకి వెళ్తున్నట్టుగా జగన్ అబ్దాలు చెబుతున్నారని విమర్శించారు. నాలుగేళ్లుగా ఒకటే మెమోరాండం తేదీలు మార్చి ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొందరు బీజేపీ నేతలతో తమకు దూరం ఉందని చెప్పారు. కొందరు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని నమ్మాం కనుకే వారితో కలిసి నడుస్తున్నామని చెప్పారు. జనసేన పార్టీ భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు. జనసేన పార్టీ రాష్ట్రం కోసం అంకితభావంతో పనిచేస్తుందని చెప్పారు.