నీ చరిత్ర మాకు తెలుసు.. నీలా రోడ్డెక్కి మాట్లాడి విలువ తగ్గించుకోం.. అంటూ పరిటాల సునీత ఎంపీ గోరంట్ల మాధవ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దివంగత మాజీమంత్రి రవిపై ఎంపీ గోరట్ల మాధవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు అనంత రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. మాధవ్ వ్యాఖ్యలు వైసీపీ, టీడీపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీస్తున్నాయి. 

రవిపై మాధవ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల రవి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారంటూ గట్టిగా ప్రశ్నించారు. పరిటాల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలు ప్రశాంతంగా ఉన్నారని గుర్తుచేశారు. 

అంతేకాదు ‘‘నీ చరిత్ర మాకు తెలుసు.. నీలా రోడ్డెక్కి మాట్లాడి మా విలువ తగ్గించుకోలేం. మరోసారి పరిటాల రవి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు’’ అని పరిటాల సునీత ఎంపీ గోరట్ల మాధవ్ ను హెచ్చరించారు.

గోరంట్ల మాధవ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ సహనం కోల్పోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు, దివంగత మాజీమంత్రి పరిటాల రవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

‘‘నక్సలైట్లు, ఫ్యాక్షనిజం పేరుతో పరిటాల రవి ఎంతో మంది తలలు నరికారు. చంద్రబాబు సహకారంతో ఎమ్మెల్యేగా ఇలాంటి పనులు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో పొలాలకు నీరు లేక ఎండిపోతుంటే.. పరిటాల రవి రక్తపు టేర్లతో పొలాలను తడిపారు. పంట పొలాలను రక్తంతో తడిపిన చరిత్ర పరిటాల రవిది’’ అని మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బీసీలకు జడ్జి పదవులు ఇవ్వరాదని, జడ్జిలుగా బీసీలు పనికిరారని చంద్రబాబు రాశారని మాధవ్ ఆరోపించారు. ‘‘ప్రత్యేక హోదాను పశువుల సంతలా.. కేంద్రానికి వేలంలో పెట్టి అమ్మిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఓటుకు నోటు కేసులో దొరికిపోయి.. దొంగలా అమరావతికి పారిపోయాడని గోరంట్ల మాధవ్‌ ఎద్దేవాచేశారు.  చంద్రబాబు, రవికి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని, అయినప్పటికీ వారిపై మాధవ్ అనుచిత వ్యాఖ్యలు చేసి అభాసుపాలవుతున్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.